మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ.. తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది..
కిస్మత్ అంటే ఇదే కావచ్చు. అందుకే పెద్దలు చెబుతుంటారు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి అని. నువ్వు ఇప్పుడు ఓడిపోయావంటే రేపు నీకు ఇంతకంటే మంచి అవకాశం ఏదో వస్తుంది.. అందుకే ఇవాళ నువ్వు ఓడిపోయావు… అని అనుకోవాలి అని చెబుతుంటారు పెద్దలు. అది అక్షర సత్యమని కిషన్ రెడ్డి విషయంలో అర్థం అయింది.
మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. కానీ.. తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం రావడం.. ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడం… ఇదివరకు ఉమ్మడి ఏపీ, తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం, ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకోవడం.. ఇవన్నీ కలిసి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని తెచ్చి పెట్టాయి.
ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు కిషన్ రెడ్డి. ఆయన పూర్తి పేరు.. గంగాపురం కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపురం ఆయన సొంత గ్రామం. 1960లో ఆయన జన్మించారు.
జనతా పార్టీ నుంచే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 1977లో జనతా పార్టీలో చేరి.. యువజన విభాగం నేతగా పనిచేశారు. ఆ తర్వాత 1980లో బీజేపీ ఆవిర్భవించాక.. అందులో చేరారు. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి పనిచేశారు.
2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హిమాయత్ నగర్.. అంబర్ పేట నియోజకవర్గంగా మారింది. అలా… 2009, 14లో అంబర్ పేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.