తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా 2012 నుంచి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఇటీవల గ్రేటర్ ఎన్నికల ఫలితా లతో మనస్థాపం చెంది తన పదవిని వదులుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ భార్య ఓటమి తర్వాతే ఆయన పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు వచ్చినా కొంత కాలం వెయిట్ చేసిన ఆయన చివరకు గ్రేటర్ ఫలితాలతో మనస్థాపం చెంది తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తే.. బాగుంటుంది? అనే విషయం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ మేధావులు కొందరు ఈ విషయంలో దూరదృష్టితో ఆలోచిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు కీలక నేతలు ఈ పదవికి పోటీ పడుతున్నారు.
ఈ ఇద్దరిలో ఒకరు.. కొమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీలో ఎప్పటినుంచో ఉన్నారు. సీనియర్. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నా.. గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయ న గల్లీ నుంచి డిల్లీ వరకు కూడా తన వాదనను బలంగా వినిపించారు. ఇక, ఇప్పుడు అవకాశం వచ్చింది. అయితే.. ఆయనకు పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంలో భిన్నమైన వాదన వినిపిస్తోంది. అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి కోమటిరెడ్డికి లేదని, పైగా ప్రధానమైన బీజేపీని ఆయన టార్గెట్ చేయడం కష్టమేనని ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైగా ఆయన వచ్చినా.. పార్టీలో ఐకమత్యం ఉంటుందా? అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంటుందని చెబుతున్నారు. అదే సయమంలో తనకు ఈ పదవి ఇవ్వాలి! అని పైకి చెప్పకపోయినా.. యువ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఈ పదవి రేసులోనే ఉన్నారు. వాక్ధాటి, చాతుర్యం, ఆది నుంచి కేసీఆర్‌పై వ్యతిరేక వైఖరి.. ఇలా అనేక రూపాల్లో రేవంత్ తెలంగాణ ప్రజలకు కనెక్ట్ అయ్యాడు. పైగా బీజేపీని టార్గెట్ చేయడంలోను రేవంత్ కీలకంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పైగా యువత ఓట్లను తనవైపు తిప్పుకోగల నాయకుడిగా కూడా ఆయనపై నమ్మకం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలే.. టీ-కాంగ్రెస్‌లో రేవంత్‌కు పగ్గాలు ఇవ్వాలనే వాదన వస్తోందని చెప్పడానికి ఉదాహరణ. మరి పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో ? చూడాలి.