ఎవరు ఎవరు..? తెలంగాణ కాంగ్రెస్ కు కాబోయే అధ్యక్షుడు ఎవరు అనే మాటలు చాలాకాలంగా వినిపిస్తూనే వచ్చినా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఎటూ తేల్చకుండా, నాన్చి వేత ధోరణితోనే ఉంటూ వచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తూ, కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే విషయంలో క్లారిటీ దొరక్క ఇంతకాలం వేచి చూస్తూ వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపిస్తున్నా, పార్టీలోని సీనియర్లు నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో, ఎప్పటికప్పుడు ఈ నిర్ణయం పై వెనకడుగు వేస్తూ వస్తోంది. కానీ కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతున్న తరుణంలో, ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించకపోతే ఇక తెలంగాణ కాంగ్రెస్ పై ఆశలు వదులుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. అందుకే కొద్దిరోజులుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం పార్టీలోని నాయకులు అందరితో చర్చలు జరుపుతున్నారు.ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరపడంతో, ఆయనే కొత్త పిసిసి రథసారధి అనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలోని నాయకులు అందరితోనూ ఈ వ్యవహారంపై పూర్తిగా చర్చించిన తరువాత శనివారం సాయంత్రం మాణిక్యం ఠాకూర్ ఢిల్లీకి వెళ్లి, కాంగ్రెస్ పెద్దలకు నివేదిక సమర్పించ బోతున్నారు. దీంతో ఈ పదవి పై ఉత్కంఠ నెలకొంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఇస్తే తాను పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటాను అనే విషయాన్ని ఠాకూర్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ పదవిపై ఆశలు పెట్టుకుని దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా నిరాశా నిస్పృహల్లో ఉన్న పార్టీని యాక్టివ్ చేసేందుకు రేవంత్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. కెసిఆర్ తో ను టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే నిత్యం తలపడుతూ కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేందుకు రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా పిసిసి అధ్యక్ష పదవి తనకే వస్తుందని, అప్పుడు మరింతగా యాక్టివ్ అవ్వాలని రేవంత్ చూస్తుండగా , ఇప్పుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ఆ పదవి వస్తుందనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో, అధిష్టానం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు మొగ్గు చూపితే, కాంగ్రెస్ లో తాను ఉన్నా ప్రయోజనం ఉండదని , ఇప్పటికే బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్న క్రమంలో ఆ పార్టీ లోకి వెళ్లి తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలని రేవంత్ చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త పీసీసీ అద్యక్షుడి ఎంపికపై అధిష్టానం నిర్ణయం ఏమిటి అనేది స్పష్టంగా తేలిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తు పై స్పష్టమైన ప్రకటన చేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం కాంగ్రెస్ లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది.