బిగ్ బ్రేకింగ్… మంత్రి కేటీఆర్‌కు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విలయతాండవం మాత్రం ఆగడం లేదు. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. అలానే కేసీఆర్ ఇంట్లో ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలగా తాజాగా… మంత్రి కేటీఆర్‌ కూడా కరోనా బారిన పడ్డారు.

 

తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని మంత్రి కేటీఆర్‌ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.