ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం నిలబెట్టుకొనేందుకు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా మారడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒంటరిగా కాకుండా పొత్తుల తో జగన్ ను ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వై నాట్ 175 అని జగన్ అంటుంటే, వై నాట్ పులివెందుల అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించి సత్తా చాటాలని జగన్ ఆరాటపడుతుంటే, పులివెందుల నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని బాబు తాపత్రయం.
ఇప్పటికే చంద్రబాబు పోటీ చేసే కుప్పంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కుప్పం అభ్యర్ధిగా భరత్ ను ఖరారు చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్సీని కూడా చేసారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ సభాముఖంగా ప్రకటించారు. కుప్పం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా భావిస్తానని కూడా స్పష్టం చేశారు. అదే సమయంలో స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో కుప్పం ఎక్కడ తన చేతిలో నుంచి జారిపోతుందనే ఆందోళన చంద్రబాబులో నెలకొంది. దీంతో అప్రమత్తమైన బాబు.. మూడు నెలలకు ఓసారి కుప్పంలో పర్యటిస్తూ తన బలాన్ని, తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు జగన్ ను పులివెందులలో ఓడించి, వైనాట్ పులివెందుల అన్న ప్రకటనను నిజం చేయాలని బాబు వ్యూహం. తన పర్యటనలో భాగంగా పులివెందులలో చంద్రబాబు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి పులివెందుల నియోజకవర్గం టీడీపీదేనని చెప్పుకుంటూ వస్తున్నారు. పులివెందుల వైసీపీకి కంచుకోట. వైఎస్ కుటుంబమే ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆయన్ను ఢీ కొట్టేందుకు కడప జిల్లా టీడీపీ ఇంచార్జి బీటెక్ రవిని చంద్రబాబు ఎంపిక చేశారు. పులివెందుల అభ్యర్థి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని క్లారిటీ కూడా ఇచ్చారు.
పులివెందులలో జగన్ కి తిరుగులేదనేది కాదనలేని సత్యం. అయితే జగన్ ని ఢీకొట్టే సత్తా బీటెక్ రవికి ఉందా అన్నదే ప్రశ్న. అలాగని తక్కువగానూ చూడలేని పరిస్థితి. 2017లో జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిపై పోటీ చేసిన బీటెక్ రవి విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీలో మరింత యాక్టివ్ అయ్యారు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఏకంగా సీఎం జగన్ పై పోటీ చేయాలని భావిస్తున్న బీటెక్ రవి.. ఎంతమేరకు ప్రభావం చూపిస్తారనేది చూడాలి.
మరోవైపు చంద్రబాబుపై పోటీ చేసే భరత్ ఉన్నత విద్యావంతుడు. బీటెక్ వరకు చదువుకున్న ఆయన, తన తండ్రి చంద్రమౌళి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019లో వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడై నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై జగన్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ధీమాతో ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. కుప్పం చంద్రబాబకు కంచుకోట. మరి భరత్ ఏ మేరకు రాణిస్తారో తేలాల్సివుంది. కంచుకోటలు బద్దలవుతాయా లేదా అనేది ఎన్నికల ఫలితాల్లో తేలే అంశం.