ఏపీలో ఉద్యోగులను టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు

-

ఏపీలో ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ప్రభుత్వం-ఎస్‌ఈసీ మధ్య జరుగుతున్న యుద్దంలో అడకత్తెరలో పొకచెక్కలా మారారు. కింది స్థాయి ఉద్యోగులు పరిస్థితిని బట్టి సరెండర్ అవుతుంటే ఉన్నతాధికారులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఏ రాష్ట్రంలోనూ ఎదుర్కొని విచిత్రమైన పరిస్థితిని ఏపీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. వారూ వీరూ అని తేడా లేకుండా.. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి పని చేసే సిబ్బంది వరకు ఒకేరకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సీఎస్‌, డీజీపీలు సహా ఎమ్మార్వో, ఎంపీడీవోల వరకు ఎప్పుడేం జరుగుతుందో..ఎలాంటి ఉత్తర్వులు వస్తాయోననే ఆందోళన పట్టి పీడిస్తోంది. ప్రభుత్వం-ఎస్‌ఈసీ మధ్య విభేధాలు ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ తీసుకున్న సంచలన నిర్ణయం..ఈ గ్యాప్‌ను మరింత పెంచడమే కాకుండా.. నిప్పును రాజేసింది.

ఎస్‌ఈసీ ఆదేశాలను పాటిస్తే బ్లాక్‌ లిస్టులో పెడతామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వం-ఎస్‌ఈసీ మధ్య సమన్వయంతో వ్యవహరించి ఎన్నికల నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇరువర్గాలు పంతాలకు పోయి.. ఉద్యోగులను బలిపెట్టడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కామెంట్లను కొన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి.

ఇక ఉద్యోగులు ఏదోరకంగా తమ అభిప్రాయాలను బయటపెట్టగలుగుతున్నారు. కానీ ఉన్నతాధికారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బయట పడి మాట్లాడలేని పరిస్థితి. ఎస్‌ఈసీ చెప్పిన ప్రకారం చేస్తే.. ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుంది. ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తే.. తమపై ఫిర్యాదుల చేయడమే కాకుండా.. ఏకంగా అభిశంసించాలని.. ఎస్‌ఆర్‌లో తమ తప్పిదాలను నమోదు చేయాలని ఏకంగా డీఓపీటీకి లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ వంటి వారిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు ఎస్‌ఈసీ. అలాగే మరో సీనియర్‌ ఐఏఎస్ ప్రవీణ్‌ ప్రకాష్‌ మీద కేంద్రానికి లేఖ రాశారు.

ఇక జిల్లాల్లో ఇద్దరు కలెక్టర్లు మీద.. మరో ఐపీఎస్‌ మీద చర్యలు తీసుకున్నారు. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఎస్‌ఈసీ కత్తి..ఎప్పుడు ఎవరి మీద వేలాడుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో ఈ వ్యవహరంపై ఉన్నతాధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులెవ్వరూ భయపడాల్సిన పని లేదని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయొచ్చని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భరోసా ఇస్తున్నారు.

అయితే ఎన్ని ప్రకటనలు చేస్తున్నా ఎన్నికల విధులు అత్యంత సున్నితమైన అంశంగా మారిపోయిందనే భావన ఇటు ఉన్నతాధికారుల్లోనూ అటు ఉద్యోగ వర్గాల్లోనూ స్పష్టంగా కన్పిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news