ఇవాళ సాయంత్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశానికి ఆహ్వానాలను పంపింది. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది. అందులోనే ఈసీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది.
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని దేశంలో ఉన్న రాజకీయ పార్టీలంతా ఓవైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. ప్రజలు ఈ సారి ప్రధాని ఎవరవుతారా.. అని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కేంద్ర ఎన్నిక సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని కూడా వాడి వేడిగా చర్చ సాగుతోంది. అయితే ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు సిద్ధమైంది.
ఇవాళ సాయంత్రం ఎన్నికల సంఘం మీడియా సమావేశానికి ఆహ్వానాలను పంపింది. సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది. అందులోనే ఈసీ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ లేదా మే నెలల్లో 7 లేదా 8 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని సమాచారం.
అయితే 2014లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 5వ తేదీనే షెడ్యూల్‌ను ప్రకటించారు. కానీ ఈ సారి మాత్రం ఆలస్యం అయింది. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ను కావాలనే ఆలస్యం చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. కాగా ప్రస్తుతం ఉన్న లోక్‌సభ పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుండగా ఈ విషయంపై చర్చించేందుకు వచ్చే వారంలో ఎన్నికల పరిశీలకులు సమావేశం అవుతారని తెలిసింది. అయితే లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల గడువు కూడా పూర్తి కావస్తున్నందున అన్నింటికీ కలిపి ఒకేసారి షెడ్యూల్ ప్రకటిస్తారా, లేదా ఇవాళ కేవలం లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.. ఆ విషయంపై మరికొన్ని గంటల్లో స్పష్టత వస్తుంది..!