ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాజీ మంత్రి లోకేష్ చుట్టూ ఇప్పు డు అంతర్గత చర్చ సాగుతోంది. ఆయన కేంద్రంగా రాజకీయ దుమారం రేగి.. ఇంకా చల్లారలేదు. దీనికి కారణం ఏంటి? ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది. 2014 ఎన్నికలకు ముందు నుంచి దాదాపు నాలుగు సంవత్సరాలుగా టీడీపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు లోకేష్. ముఖ్యంగాపార్టీ సబ్యత్వాలను పెంచడం తోపాటు.. యువతను ఆకర్షించే పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే పార్టీ పుంజుకుందనడంలో సందేహం లేదు. అయితే, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా పుత్రరత్నానికి ఏదైనా పదవిని అప్పగించాలని భావించిన చంద్రబాబు అదే సమయంలో పక్కరాష్ట్రం తెలంగాణతో పోటీ పడ్డారు.
అక్కడ సీఎం కేసీఆర్ తన తనయుడికి మంత్రి పదవి ఇవ్వడంతో దీనిని కాపీ కొట్టిన చంద్రబాబు ఇదే బాట లో తన తనయుడికి కూడా మంత్రి పదవిని అప్పగించారు. మంత్రిగా లోకేష్ సత్తా నిరూపించాడో లేదో తెలి యదు కానీ, ప్రజలను ఆకర్షించడంలో మాత్రం చాలా వెనుకబడిపోయారు. ఈ ఏడాది ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి వరకు లోకేష్ ఆధిపత్యాన్ని మౌనంగా భరించిన నాయకులు ఇప్పటి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొందరు జేసీ వంటి నాయకులు మాత్రం తమ వారసుల టికెట్ల కోసం .., లోకేష్‌ను తదుపరి టీడీపీ సీఎం అభ్యర్థిగా అంగీకరించినా.. బుచ్చయ్య చౌదరి వంటి వారు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఇక పార్టీలోని సీనియర్లు, ప్రజల బలం ఎక్కువగా ఉన్న నాయకులు కూడా ఆది నుంచి లోకేష్ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. అప్పట్లో రెవ్వెన్యూ, ఉపముఖ్యమంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి, అప్పటి హోంమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చినరాజప్ప వంటి వారు బహిరంగంగానే అసంతృప్తివ్యక్తం చేశారు.
మేం కేవలం పేరుకే మంత్రులం అంటూ.. ఇద్దరు నాయకులు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా ఇదే వ్యతిరేకత కొనసాగుతోంది. సానుకూల స్పందన ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల మద్దతు కూడగట్టలేక పోవడం లోకేష్‌కు చాలా మైనస్‌గా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనను పార్టీలోని కీలక పదవి(కార్యాచరణ అధ్యక్షుడు)కి ప్రమోట్ చేయకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.