హుజూరాబాద్ ఉపపోరులో ఈటల రాజేందర్‌కు పోటీగా టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని బరిలోకి దింపిన విషయం తెలిసిందే. విద్యార్ధి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన గెల్లుకు సీటు ఇచ్చి కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అయితే ఈటల మీద పోలిస్తే గెల్లు రాజకీయంగా చాలా చిన్నవాడు. కాకపోతే అధికార పార్టీ బలంతో గెల్లు, ఈటలకు టఫ్ ఫైట్ ఇవ్వనున్నారు. అయితే రాజకీయంగా తనకంటే చిన్నవాడైన గెల్లుపై ఈటల నోరు పారేసుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. గెల్లుని బానిస అన్నారని చెప్పి ఈటలని టార్గెట్ చేశారు.
తాజాగా హుజూరాబాద్‌లో జరిగిన కుల సంఘాల భేటీలో ఈటల, గెల్లుని ఉద్దేశించి బానిస అన్నారని ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లుని ప్రకటించడంపై రాజేందర్…ఆ మీటింగులో మాట్లాడుతూ… ‘ఇప్పుడే ఓ బీసీ బిడ్డను పోటీ పెట్టారని తనకు తెలిసిందని, వాళ్లు బీసీ బిడ్డనా.. ఓసీ బిడ్డనా. ఎస్సీ బిడ్డనా కాదని, ఆయనకు కావాల్సింది ఒక బానిస అని, ఆ బానిస బిడ్డ మీకు కావాలా.. లేక పోరాడే వాళ్లు కావాలా..’ అని అన్నారని తెలుస్తోంది.
అయితే ఈ మాటలని బట్టి చూస్తే ఈటల డైరక్ట్‌గా గెల్లు గురించి మాట్లాడలేదు. కేసీఆర్…కింద నాయకులని బానిసలు మాదిరిగా చూస్తారు కాబట్టి, అలాంటి వాళ్ళు కావాలా, లేక తనకు మాదిరిగా పోరాటం చేసే వాళ్ళు కావాలా అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. కానీ ఈటల మాటలు మాత్రం జనాల్లోకి వేరుగా వెళుతున్నాయి. గెల్లు బానిస అని ఈటల అన్నారని చెప్పి టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ కేసీఆర్…బీసీ, దళిత నాయకులని బానిసలు మాదిరిగా చూస్తారని పరోక్షంగా ఈటల మాట్లాడారు. అయితే ఇలా నెగిటివ్ ప్రచారం జరగడం ఈటలకే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఈటలదే.