ఇప్పుడు తెలంగాణలో సైదాబాద్‌లోని ఆరేండ్ల చిన్నారి మీద జరిగిన అత్యాచారం ఉదంతం దేశం మొత్తం చర్చీనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితుడిని పట్టుకుని ఉరి తీయాలంటూ సామాన్య జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదంతంపై రెండో మాటకు తావేలేదు. నిందితుడు రాజు చేసిన పనికి కచ్చితంగా అతన్ని శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజును శిక్షించటానికి మార్గాలున్నాయి. చట్టబద్ధంగా అతనికి శిక్ష విధించాల్సి ఉంది.
కాగా ఈ విషయాన్ని సామాన్యులు మర్చిపోయినా పర్వాలేదు గానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి మరచిపోకూడదు. అయితే నిత్యం నోరు జారి మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. రాజును ఎలాగైనా పట్టుకుని ఎన్ కౌంటర్ చేసేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పటమే ఇప్పుడు రచ్చగా మారింది. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి ఇంకేమైనా హామీలివ్వవచ్చు గానీ ఇలా చట్టాన్ని ధిక్కరించే విధంగా ఏదో జనాల కోసం ఎన్ కౌంటర్ చేస్తామనే మాటలు మంచివి కావని చెబుతున్నారు.
కాగా గతంలో తెలంగాణలో కొన్ని సందర్భాల్లో పోలీసులు ఎన్ కౌంటర్లు కూడా చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే అలా జరిగిన సమయంలో ఎవరూ కూడా ముందస్తు ప్రకటనలు చేయలేదు. ఎన్ కౌంటర్లు అనేవి చట్టానికి లోబడి మాత్రమే ఉంటాయి. అంతేగానీ అధికారంలో ఉన్న వారు దాన్ని కోరుకోవడం మంచిది కాదు. కాగా ఇప్పడు మల్లారెడ్డి ప్రకటన మాత్రం బాధ్యతా రాహిత్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదో పేరు కోసం ఇలాంటి కామెంట్లు చేయొద్దని సూచిస్తున్నారు. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.