కాలం కలిసి రాకపోతే రాజకీయాల్లో ఎవరెక్కడ ఉంటారో ఊహించలేం. ఆ మాజీ మంత్రి కమ్ సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాగే ఉందట. నెల్లూరు జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ కుటుంబంగా ఆనం ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర వారిది. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న నానుడి ఆనం వారి విషయంలోనూ రుజువైంది. కాంగ్రెస్‌పార్టీ పతనం.. రాష్ట్ర విభజన తర్వాత తడబడుతూ వేసిన అడుగులు రాజకీయ జీవితానికి నష్టం చేకూర్చాయని చెబుతారు. ఒకప్పుడు మంత్రిగా కీలక శాఖలు నిర్వహించిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఏదో ఉన్నారంతే అనుకునే పరిస్థితి.
2014లో టీడీపీలో చేరి.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకొని ఎమ్మెల్యే అయ్యారు కానీ.. ఆయన్ని పట్టించుకునేవారు లేరని టాక్.నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్నప్పటికీ వెంకటగిరికే పరిమితమయ్యారు ఆనం రామనారాయణరెడ్డి. తనను ఎవరూ గుర్తించడం లేదనో ఏమో కానీ ఆ మధ్య నెల్లూరులో మాఫియా అని కామెంట్స్ చేసి సొంతపార్టీలోనే కలకలం రేపారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత సైలెంట్ అయ్యారు ఆనం. అంతా సర్దుకుందని భావించేలోపే కరోనా సమయంలో వెంకటగిరిపై వివక్ష చూపుతున్నారని మళ్లీ నోటికి పనిచెప్పారాయన. రెండురోజులు అధికారులను ఏకిపారేశారు.
ఇదే సమయంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లా వైసీపీ వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఆయనే. సజ్జలతో జరిగిన భేటీకి ఆనం తప్ప అంతా హాజరయ్యారట. దీంతో ఆనం ఎందుకు రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కావాలనే రాలేదా? లేక తన నిరసనను పార్టీ గుర్తించాలని డుమ్మా కొట్టారో అని చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. రాజకీయంగా ఆనం దారెటు అన్న చర్చ కూడా మొదలైంది.