చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు, పనికిమాలిన నేత: ఎమ్మెల్యే రోజా హాట్ కామెంట్స్‌

టీడీపీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేటి నుంచి ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజక వర్గంలో యాత్ర ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు బలైపోతున్న పేదలకు అండగా ఉండేందుకే ప్రజా చైతన్యయాత్రలను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే రోజా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు, పనికిమాలిన నేత అని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ది రాలేదని రోజా అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు విశేష ప్రజాధారణ చూసి ఓర్వలేక ప్రజా చైతన్య యాత్ర పేరుతో సిగ్గు లేకుండా తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా, జగన్ పాలన లో చంద్రబాబు మినహా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గత ఎన్నికల్లో 23 సీట్లొచ్చిన టీడీపీ కి వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేసారు.