ఎంపీ డీఎస్ సంచలన వ్యాఖ్యలు… ఏం చేయాలో పాలుపోని స్థితిలో గులాబీ లీడర్లు

ఉమ్మడి ఏపీలో ఉన్న సమయంలో రాష్ర్ట రాజకీయాలను శాసించిన నేత అయిన డీఎస్ నేడు టీఆర్ఎస్ లో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా ఉన్నారు. తన రెండు కళ్లుగా చెప్పే తన కొడుకులు ఇరువురు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను మాత్రం టీఆర్ఎస్ లో ఉన్నాడా.? లేడా అనే విధంగా నిస్సత్తువగా మారాడు. ఇలా కావడానికి వెనుక కొన్ని డీఎస్ వ్యతిరేఖ శక్తులు పని చేశాయని చెబుతారు. ఇలా ఉండగా… డీఎస్ తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విధంగా ఉండడం గమనార్హం.

రాజ్య సభ ఎంపీగా ఉన్న డీఎస్ మాట్లాడుతూ.. అసలు తాను ఎంపీనేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నే నేరుగా అడగాలన్నారు. పైగా టీఆర్ఎస్ నేతలు తనను ఎటువంటి ఫంక్షన్లకు కానీ ప్రారంభోత్సవాలకు కానీ పిలవడం లేదని తెలిపారు. తన చిన్న కొడుకు కష్టపడి ఎంపీగా గెలిచాడని అన్నారు. పెద్దకొడుకు ప్రస్తుతం కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలిపారు. వారి భవిష్యత్ నిర్ణయాల్లో తాను ఎటువంటి జోక్యం చేసుకోనని ఆయన తెలిపారు. వారు ఇష్టం వచ్చిన విధంగా ఉండవచ్చని తెలిపారు. తన పెద్దకొడుకు కూడా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నారు.

ప్రస్తుతం డీఎస్ చేసిన వ్యాఖ్యలు అధికార టీఆర్ఎస్ కు నష్టం కలిగించేలా ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. తన పెద్ద కొడుకు కాంగ్రెస్ కు వెళ్తున్నట్లు డీఎస్ స్పష్టం చేశారని పరిశీలకులు చెబుతున్నారు. పైగా డీఎస్ వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని పేర్కొంటున్నారు.