తనకున్న వందల ఎకరాల ఆస్తిని కులం కోసం కరిగించుకున్నారు. విలువలకు ప్రాధాన్యత ఇస్తూ కాపులకు అన్యాయం చేసే పార్టీలో తాను ఉండబోనని స్పష్టం చేసి ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు.. అవకాశం చిక్కినప్పుడల్లా కాపుల ప్రయోజనాల కోసం తన గళం విప్పుతూ వచ్చారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనే కాపు ఉద్యమాల్లో రియల్ హీరోగా “ముద్రపడ్డ” ముద్రగడ పద్మనాభం.. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన కాపు ఉద్యమాల కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు.. కొన్నేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాపుల రిజర్వేషన్, కాపుల సంక్షేమం గురించి మాట్లాడుకునే సమయంలో తప్పనిసరిగా ముద్రగడ పద్మనాభం చేసిన త్యాగాలను, హరి రామ జోగయ్య లాంటి ప్రముఖుల సేవల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు పై ఉన్న తీవ్ర వ్యతిరేకతతో ముద్రగడ జనసేనలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ జనసేన టిడిపి తో జతకట్టడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేనలో చేరికకు నాదెండ్ల మనోహర్ చంద్రబాబు అడ్డు పుల్ల వేశారని పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్న మాట. అయితే ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు..
తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి జిల్లాలలో సంఖ్యాపరంగా చూస్తే మొత్తం 34 నియోజకవర్గాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వారు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారు. ఈ క్రమంలో 2014,2019 సమయం నుంచి సీఎం జగన్ కాపులకు అండగా ఉంటూ వస్తున్నారు. కాపులకి అధిక స్థానాలు కేటాయించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడులా దొంగ నాటకాలు జగన్ ఆడలేదు. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాదంటూ నిర్మొహమాటంగా జగన్ ప్రకటించారు. కానీ కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. 19 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలను వారికి కేటాయించి, కాపుల పక్షపాతిగా సీఎం జగన్ నిరూపించుకున్నారు.
ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక టిడిపి, జనసేన నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందట. ముద్రగడకు ఉండే కాపుల మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైవర్షన్ అవుతుందని… తాము అన్ని విధాలా నష్టపోతామని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయట.. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేస్తారని పద్మనాభం చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నేతలకు రుచించడం లేదు. దీంతో ఆయనపై అసత్యాలు ప్రచారం చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారని ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. ఏది ఏమైనా ముద్రగడ చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు.