నడవలేక నడవక తప్పక నడుస్తున్న తెలంగాణా కాంగ్రెస్ కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. ఇన్నాళ్ళు తెలంగాణాలో ఆ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన ఉత్త౦ కుమార్ రెడ్డి తాజాగా తాను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుని నియోజకవర్గంపై ఎక్కువగా సమయం కేటాయిస్తాను అని ప్రకటించారు. ఇది రాజకీయంగా ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే తెలంగాణా కాంగ్రెస్ అనేది ఒక సముద్ర౦. ఆ సముద్రంలో ఎవరు ఈది తీరానికి చేరినా, మరో నాయకుడు వెనుక నుండి లాగి మళ్ళీ ఆ సముద్రంలోకే తీసుకువెళ్తాడు.
దీనితో నాయకులు కొత్తగా ఆలోచించడం మాని అధిష్టానం మీద ఆధారపడటం మొదలుపెట్టారు. ఇవన్ని గత అయిదేళ్ళ నుంచి ఉత్త౦ మోస్తూ వస్తున్నారు. తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కన పెట్టి గెలిస్తే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని తన్నుకున్నారు. సీట్ల విషయంలో గొడవపడి తెరాస పార్టీ నెత్తిన పాలుపోసారు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం, ఇక భవిష్యత్తు లేదు, ప్రజల్లో ఆదరణ లేదనే విషయం స్పష్టమవుతుంది.
ఇప్పుడు ఉత్తం చేసిన వ్యాఖ్యలను తెరాస తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉత్త౦ తప్పుకుంటే ఆ పదవి మాకు కావాలంటే మాకు కావాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను పక్కదారి పట్టించే అవకాశాలు ఉన్నాయనే కలవరం కాంగ్రెస్ కార్యకర్తల్లో మొదలయింది. మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకు వెళతానని ఉత్తమ చేసిన వ్యాఖ్యలను తెరాస తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు టీపీసీసీ పంచాయితి మొదలైతే అది కూడా తెరాస అనుకూలంగా మార్చుకుని విమర్శలు చేసే అవకాశం ఉంది. కీలకమైన మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉత్త౦ చేసిన వ్యాఖ్యలు తెరాస నెత్తిన పాలుపోసినట్టే.