మునుగోడు మినీ వార్.. అస్త్రాలు రెడీ.!

-

మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి..సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ మినీ వార్‌లో సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. అధికార బలం, అభివృద్ధి పనులకు నిధులు అందజేయడం, అలాగే పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులని మునుగోడుకు పంపించి..ఎలాగైనా టీఆర్ఎస్‌ గెలుపు ఖాయం చేయాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇక ఆ పార్టీ తరుపున కూసుకుంట్ల ప్రభాక రెడ్డి బరిలో దిగడం దాదాపు ఖాయమే.

అటు తమ సిట్టింగ్ సీటుని కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది..అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు..అలాగే కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో మోహరించారు. ఇప్పుడు ఉపఎన్నిక షెడ్యూల్ రావడంతో..కాంగ్రెస్ రాష్ట్ర నేతలంతా మునుగోడులో మకాం వేయనున్నారు. కనీసం మునుగోడులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది.

బీజేపీ విషయానికొస్తే..మునుగోడు ఉపఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా ఇక్కడ ఈజీగా గెలవడం బీజేపీకి సాధ్యం కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది..కానీ ఆయనతో పాటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ వైపు రాలేదు. అయినా సరే తన సొంత బలంతో సత్తా చాటాలని చెప్పి కోమటిరెడ్డి ఉన్నారు. ఇక కోమటిరెడ్డికి అండగా రాష్ట్ర బీజేపీ నేతలు..మునుగోడుపై ఫోకస్ చేసి పనిచేయనున్నారు.

ఇప్పటికే బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రని వాయిదా వేసుకుని మునుగోడుపై ఫోకస్ పెట్టారు. అటు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ..ఇలా బడా నేతలంతా మునుగోడులో తమదైన శైలిలో ప్రచారం చేయనున్నారు. ఇక జాతీయ నేతలు సైతం మునుగోడులో ప్రచారం చేయనున్నారు. అలాగే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఓ భారీ సభ కూడా జరగనుంది.

అటు కేసీఆర్ సైతం మునుగోడులో ఓ భారీ సభలో పాల్గొనున్నారు. అలాగే హరీష్ రావు, కేటీఆర్‌లు సైతం మునుగోడులో ఎంట్రీ ఇవ్వనున్నారు. మొత్తానికి మూడు పార్టీలు మునుగోడులో గెలవడానికి అస్త్రాలని రెడీ చేసుకుని బరిలో దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news