గుంటూరు: ఏపీ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం గురజాల నియోజకవర్గంలో పర్యటించారు. మాడుగుల గ్రామంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును మంత్రి తెలుసుకున్నారు. మాడుగుల గ్రామంలో సబ్‌స్టేషన్, సీసీ రోడ్ల నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. అలాగే రూ.13 కోట్లతో నిర్మించిన రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని లోకేష్ ప్రారంభించారు.
కాగా లోకేశ్ పర్యటన ముందు రోజు సభకు హాజరయ్యే వారికోసం రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మద్యం బాటిళ్ల కోసం లక్షా 40 వేల రూపాయలు ఇచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ప్రకటించిన వీడియో వైరల్ అయింది. లోకేశ్ సభలకు హాజరయ్యే కార్యకర్తలకు మద్యం పంపిణీ వార్త హల్‌చల్ చేసింది.