గన్నవరం బరిలో లోకేష్.. సైడ్ అవుతానంటున్న వంశీ..

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి..అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు హైలైట్ కాకుండా ఈ రెండు పార్టీల మధ్యే రాజకీయమే హైలైట్ అవుతుంది. ఇప్పటికే ఏపీలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. తమ ఆఫీసులపై దాడిపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి…ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరనున్నారు.

nara lokesh vallabaneni vamsi

ఇటు తమ సీఎం జగన్‌ని టీడీపీ నేత తిట్టిన విషయంపై వైసీపీ కూడా ఢిల్లీకి వెళ్ళి టీడీపీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని కోరనుంది. ఇలా రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నాయకుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడుస్తోంది. తాజాగా గన్నవరం వల్లభనేని వంశీ స్పందిస్తూ…టీడీపీకి ఓ సవాల్ విసిరారు. తాను గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే లోకేష్‌ని తనపై పోటీకి దింపాలని సవాల్ చేశారు.

చంద్రబాబు, లోకేష్‌లలో ఎవరైనా తాను పోటీకి సిద్దమని, లోకేష్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అంటే గన్నవరంలో తన గెలుపుపై వంశీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ వంశీకి అంత ఫాలోయింగ్ ఉంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వంశీ..టీడీపీ తరుపున గన్నవరం నియోజకవర్గంలో గెలిచారు.

కానీ 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేశారు. అక్కడ నుంచి వంశీ….చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజా ఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, గన్నవరంలో లోకేష్ పోటీకి దిగాలని సవాల్ చేశారు. ఈ సవాల్ వర్కౌట్ అవ్వదనే చెప్పాలి. కాకపోతే గన్నవరంలో వంశీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయన్ని ఓడించడం టీడీపీకి కష్టమనే చెప్పాలి.