భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలలో భాగంగా తనకు హోటల్ వద్దని విమానాశ్రయంలోనే బస చేస్తానని నిర్ణయ౦ తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత విదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. పలు దేశాలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే వ్యూహంలో భాగంగా ఆయన ఆయా దేశాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రధానులు, దేశాధ్యక్షులతో సమావేశమవుతున్నారు. దాదాపు 70 దేశాల్లో ఆయన పర్యటించారు.
ఇదిలా ఉంటే ఆయన విదేశీ పర్యటన ఖర్చు పై విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలకు వెళ్తున్న ప్రధాని… దేశ ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని, ఆయన అనవసరంగా కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. విదేశీ పర్యటనల సమయంలో సాంకేతిక౦గా పర్యటన వాయిదా పడినప్పుడు ఆగిపోయినప్పుడు, రాత్రిపూట లగ్జరీ ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయడానికి బదులుగా విమానాశ్రయం,
టెర్మినల్స్ వద్ద విశ్రాంతి తీసుకొని స్నానం చేయడాన్ని ఆయన ఎంచుకున్నారని అమిత్ షా వివరించారు. అదే విధంగా “తన వ్యక్తిగత మరియు ప్రజా జీవితంలో, ప్రధాని మోడీ చాలా క్రమశిక్షణా విధానాన్ని పాటించారని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఉదాహరణకు, ప్రధాని మోడీ విదేశాలకు వెళ్ళినప్పుడల్లా, ఆయనతో 20 శాతం కంటే తక్కువ మంది సిబ్బందిని తీసుకుంటారన్నారు. అంతకుముందు అధికారులు ప్రత్యేక కార్లను ఉపయోగి౦చే వారని… ఇప్పుడు వారు బస్సు లేదా పెద్ద వాహనాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్ షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి… ఇక ఇదంతా ప్రచారమని కొందరు అంటుంటే మోడీ డౌన్ టు ఎర్త్ అని బిజెపి వాళ్ళు అంటున్నారు.