తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి మొదలైన విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది. జనవరి 22న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 25న ఓట్లను లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికల్లో సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు సాధించి… మరోసారి తెలంగాణలో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. అయితే టార్గెట్‌ను సాధించే బాధ్యతలను భుజాన వేసుకున్న తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…ఈ విషయంలో పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రేపు జరగబోయే కార్యవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ముందుగా అభ్యర్థుల ఎంపికపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని భావిస్తున్న పార్టీ నాయకత్వం… టికెట్ల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటిలో టికెట్ల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంటారని సమాచారం. ప్రతి వార్డులో టికెట్ కోసం పోటీ పడే అభ్యర్థులను గుర్తించి… వారిలో ఒకరిని ఎంపిక చేయడం ఈ కమిటీ విధి. మొత్తానికి తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్ ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.