తెలంగాణ టీడీపీ నేతలకు కొత్త సమస్యలు

-

తెలంగాణలో టీడీపీ ఉనికి కాపాడుకునే పరిస్థితిలో ఉండటంతో ఎన్టీఆర్‌ భవన్‌వైపు చూసేవారు కరువయ్యారు. ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు గుడ్‌బై చెప్పారో కూడా తేల్చుకోలేని పరిస్థితి. ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ.. పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత కాస్త సందడి కనిపించింది. పదవులు దక్కాయన్న సంతోషమో ఏమో కానీ.. కొత్త ముఖాలు.. కొత్త నాయకులు పార్టీ ఆఫీసు వంక చూశారు. వారికి విషయం అర్థమై పార్టీ ఆఫీసు మాకెంత దూరమో.. మేము కూడా పార్టీ ఆఫీసుకు అంతే దూరం అన్నట్టు ఉంటున్నారట. దీనిపై టీడీపీ కేంద్రకార్యాలయంలోనూ చర్చ నడుస్తుందట.

 

అధికారంలో ఉంటే.. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు పార్టీ ఆఫీసుల్లో నేతలు.. కార్యకర్తల సందడి ఉంటుంది. అదే పవర్ పోతే.. ఫీజు తీసేసినట్టు అయిపోతుంది. వరసగా ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి ఇంకా దయనీయంగా మారిపోతుంది. ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ దుస్థితి ఇలాగే ఉందట. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారట తెలుగు తమ్ముళ్లు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నాయకులతో కళకళలాడేది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ భవన్‌.. తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యాలయంగా మారింది. ఈ ఆఫీసు తాళాలు ఇక్కడే ఉంటాయి కానీ.. నియంత్రణ మొత్తం కేంద్ర పార్టీ ఆఫీసు నుంచే జరుగుతోందట. తెలంగాణ టీడీపీ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చంద్రబాబు చెప్పినా.. ఇక్కడ జరుగుతోంది మరొకటి అని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. రెండేళ్లగా కార్యాలయ సెక్రటరీ లేరు. దాని గురించి అడిగేవారు కూడా లేరట.

తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 17 ఏళ్లు అయింది. పార్టీ దగ్గర డబ్బులు లేవు. రోజువారీ కార్యాలయ నిర్వహణ ఇబ్బందిగా మారిందట. మొన్నటి వరకు టీడీపీ ఏపీలో అధికారంలో ఉంటడంతో కాస్త తేరుకున్నా.. ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోవడంతో కష్టాలు ఇంకా రెట్టింపు అయినట్టు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొన్నటి వరకు ఇక్కడ ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా కేంద్ర కమిటీ చూసుకునేది. ఇప్పుడు అది కూడా లేదట. ఏడాదిగా పార్టీ ఆఫీస్‌ మెయింటినెన్స్‌కు ఒక్క రూపాయి రాలేదన్నది టీ టీడీపీ నేతలు చెప్పేమాట. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ భవన్‌కు ఎవరైనా నేత వస్తే ఆశగా చూసే పరిస్థితి ఉందట.

హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశాలకు వచ్చేందుకు కూడా రవాణా ఖర్చులు లేక కొందరు టీడీపీ నాయకులు ఇబ్బంది పడినట్టు సమాచారం. గతంలో జిల్లాల నుంచి ఎవరైనా మీటింగ్‌కు వస్తే రవాణా ఖర్చులు ఇచ్చేవారట. ఇప్పుడు ఫండ్స్‌ లేకపోవడంతో వాటికి స్వస్తి చెప్పారట. దీంతో జిల్లాల నుంచి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చేవారు తగ్గిపోయారని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ ఆఫీసుకు రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా వస్తే.. ప్రెస్‌మీట్‌ పెట్టి వెళ్లిపోతున్నారట. ఎవరైనా ప్రశ్నిస్తే.. మీకు తెలియని విషయమా అని బదులిస్తున్నారట టీ టీడీపీ చీఫ్‌ ఎల్‌ రమణ.

ఏపీలో టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆర్థిక వనరుల విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్‌ భవన్‌లో ఖర్చుల కోసం ప్రతిపాదనలు పంపితే అక్కడి నుంచి ఆమోదం లభించేవరకు వేచి చూస్తున్నారట తెలంగాణ తెలుగు తమ్ముళ్లు.

Read more RELATED
Recommended to you

Latest news