సురేఖ‌కు నాన్ లోక‌ల్ ఎఫెక్ట్‌.. లోక‌ల్ క్యాండిడేట్‌పైనే రేవంత్ దృష్టి..

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇప్పటికే ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాగా, విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ గులాబీ పార్టీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవబోతున్నారు అనేది ఇంకా తేలలేదు. ద్విముఖంగా ఉన్న పోటీని త్రిముఖం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ హుజురాబాద్‌లో పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేయబోయే తొలి ఉప ఎన్నిక హుజురాబాద్ కాబట్టి ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నదనేది ముఖ్యమే. కాగా, వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత కొండా సురేఖను అభ్యర్థిగా ఫైనల్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు స్థానిక నేతలు అయితేనే బాగుంటుందని సలహా ఇచ్చారని, అందుకే అభ్యర్థి ఎంపిక ఆలస్యమవుతున్నదన్న చర్చ నడుస్తున్నది.

స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరుతున్నట్లు టాక్. అయితే, స్థానికత అనగా లోకల్, నాన్ లోకల్ అనే అంశాలను పక్కనబెట్టి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఆలోచనలో టీపీసీసీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కసరత్తు చేశాకనే కొండా సురేఖ పేరు తెరమీదకు తీసుకొచ్చారనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా సెప్టెంబరు 10 తర్వాతే అభ్యర్థి ఎవరనేది ఫైనల్ అవుతుందని వినికిడి. హుజురాబాద్ బరిలో నిలవబోయే అభ్యర్థి పేరు ఖరారయ్యాక రేవంత్‌రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెడతారని సమాచారం.