రేవంత్‌కు బండి మార్క్ చెక్…సక్సెస్ అయినట్లేనా…

తెలంగాణ పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించని ముందు వరకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో దాదాపు కనుమరుగయ్యే స్థితికొచ్చేసిన టి‌డి‌పి మాదిరిగా కాంగ్రెస్ పరిస్తితి కూడా దిగజారింది. ఇదే గ్యాప్‌లో తెలంగాణలో బి‌జే‌పి పుంజుకోవడం మొదలైంది. పైగా దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం గానీ, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడంతో టి‌ఆర్‌ఎస్‌కు బి‌జే‌పినే ప్రత్యామ్నాయం అని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ మనుగడ ఉండదని చెప్పి కొందరు నాయకులు బి‌జే‌పిలోకి వెళ్ళిపోయారు. మరికొందరు టి‌ఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే రేవంత్ రెడ్డి పి‌సి‌సి‌ బాధ్యతలు తీసుకున్నాక పరిస్తితి మారింది. రేవంత్ దూకుడుతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చింది. అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. బలమైన క్యాడర్ ఉండటంతో కాంగ్రెస్ త్వరగా పికప్ అయింది. అలాగే ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఆగాయి. అదే సమయంలో ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి రావడం మొదలైంది. ఈ క్రమంలో పలువురు బి‌జే‌పి నాయకులు కాంగ్రెస్‌లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, కూల శ్రీశైలం గౌడ్, మూల విక్రమ్ గౌడ్ వంటి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ఇక బీజేపీలో కొనసాగుతున్న ఈ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన బండి సంజయ్.. వారు అటు వైపు వెళ్లకుండా నిలువరించారు.

అలాగే తన పాదయాత్రతో పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చారు. దూకుడుగా కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రేవంత్‌కు ధీటుగా తాను కూడా ఉన్నానని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బండి దూకుడుతో బి‌జే‌పికి కాస్త పికప్ అయింది. దీంతో పలువురు నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆగిపోయారు.