హుజూరాబాద్ ఉప పోరు ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ కానున్నది. సంఖ్యా బలం దృష్ట్యా ఆరు స్థానాలు కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో పడనున్నాయి. ఇందుకు తగినట్లుగా గులాబీ బాస్ కే చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తున్నది.
2019, శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పాడి కౌశిక్‌రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. మళ్లీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని అనుకున్న పాడి కౌశిక్‌రెడ్డి అనూహ్యంగా పార్టీ ఫిరాయించారు. గులాబీ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించే అవకాశం ఉండటంతో పార్టీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. గవవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. పరోక్షంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల బరి నుంచి ఆయన్ని తప్పించారు. కానీ, గులాబీ బాస్ కేసీఆర్‌కూ పాడి కౌశిక్‌రెడ్డికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఝలక్ ఇచ్చారు. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు. దీంతో టీఆర్‌ఎస్ అధినేత పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది.
టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావును నమ్మి రాత్రికి రాత్రి పాడి కౌశిక్ పార్టీ ఫిరాయించారు. ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలను గులాబీ శ్రేణుల కంటే ఎక్కువగా ఆయనే గుప్పించారు. కాంగ్రెస్ టికెట్టును కోల్పోయారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు. ఇంత చేసినా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర పడే అవకాశం దాదాపు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని మండలికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. గత కొన్ని నెలలుగా చేతి దాక వచ్చి నోటికి అందని పదవి ఈ రూపంలోనైనా కౌశిక్‌రెడ్డి వరించనున్నది.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, రాజకీయ, సామాజిక సమీకణాలు పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన్ని ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి మంత్రివర్గంలోకి కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పాడి కౌశిక్‌రెడ్డిని కూడా ఎమ్మెల్యే కోటాలోనే మండలికి పంపించాలని గులాబీ బాస్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. అప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి పదవులు ఇచ్చినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపి, ఎమ్మెల్యే కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికకు లైన్ క్లియర్ చేయనన్నట్లు సమాచారం.