జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చవిచూశారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసినా… కేవలం ఒక్కటంటే ఒకే సీటు దక్కించుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన నుంచి నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోయినా కనీసం గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటామని జనసేన నేతలు భావించారు.
కానీ ఆ ఆశలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఏకంగా పార్టీ అధ్యక్షుడే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆ పార్టీ పై నాయకులకు ఆశలు గల్లంతయ్యాయి. ఈ పరిస్థితుల్లో జనసేనాని విశాఖ లో లాంగ్ మార్చ్ నిర్వహించడం ద్వారా పార్టీకి ఉత్సాహం తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే విశాఖ వేదికగా ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
ఆయన ఏమన్నారంటే.. “ సీఎం జగన్ అద్భుత పాలన అందిస్తే నేను మళ్లీ సినిమాలు చేసుకుంటా. ఎన్నికల్లో ఓడిపోయామని అలుసా? ఓటమి, గెలుపు కాదు.. పోరాటమే మాకు తెలుసు. నన్ను విమర్శించే నాయకుల్లా నాకు వేల ఎకరాలు లేవు. వైకాపా నేతల్లా రాజకీయాల్లో రూ.వందలకోట్లు ఖర్చు పెట్టలేను..అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోట మళ్లీ సినిమాలు అన్న పదం రావడం ఆసక్తికరమే. ఆయన ఒక సినిమాలో నటించబోతున్నారని ఇటీవల పత్రికలలో వార్తలు వచ్చాయి. మరి దానిని దృష్టిలో ఉంచుకుని అన్నారో… ఏమో కాని ఆయన సినిమాలలోకి వెళ్లడానికి జగన్ కు కండిషన్ పెట్టారు. తాను అధికారం కోసం అర్రుల చాచే వ్యక్తిని కాదంటున్నారు. రాజకీయాలు అంటే అందరికీ సంపాదనేమోనని కానీ తనకు మాత్రం బాధ్యత అని చెబుతున్నారు. ప్రజల ఆవేదనే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. మరి జగన్ పవన్ వ్యాఖ్యలను నిజం చేస్తారేమో..?