చంద్రబాబుకే నా మద్దతు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కల్యాణ్

ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా రోజులకు బయటికి వచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. నంద్యాలకు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఇటీవలే మృతి చెందిన సామాజిక వేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు ఎస్సీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

ఏపీలో ఎన్నికలు గత నెలలోనే ముగిశాయి. తర్వాత ప్రధాన పార్టీలన్నీ జనాలకు తమ ముఖాలను కూడా చూపించలేదు. కాకపోతే ఇంటర్నల్ గా వాళ్లు చేయాల్సినవి చేస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి.. ఇలా వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయి.. కానీ.. జనాల ముందుకు మాత్రం ఎవ్వరూ రావట్లేదు.

అయితే.. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలా రోజులకు బయటికి వచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. నంద్యాలకు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఇటీవలే మృతి చెందిన సామాజిక వేత్త, సీనియర్ రాజకీయ నాయకుడు ఎస్సీవై రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన అంత్యక్రియలకు హాజరుకాకున్నప్పటికీ.. ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

నంద్యాలకు వచ్చినప్పుడు పవన్ తనను కూడా తాను పట్టించుకోనంతగా ఉన్నారట. గడ్డం పెంచుకొని.. జుట్టు పెంచుకొని.. ముఖంలో కూడా ఏమాత్రం వెలుగు లేకుండా.. ఏదో కోల్పోయిన వ్యక్తిలా ఉన్నారట పవన్. పవన్ అలా ఉండటం చూసి ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారట. అయితే.. పవన్ కు చాలారోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న కంటి గాయం మళ్లీ ప్రారంభమైందట. అందుకే.. ఎన్నికలు ముగియగానే.. బయటికి రాకుండా ఉన్నారని కూడా జనాలు చెప్పుకుంటున్నారు. కాకపోతే పవన్ లో ఈసారి జనసేనకు ఎక్కువగా సీట్లు రావనే విషయం తెలిసిపోయిందని.. అందుకే.. ఆయన డీలా పడిపోయారని చెప్పుకుంటున్నారు.

సరే.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇటీవలే పవన్ కల్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… చంద్రబాబుకే తన మద్దతు అంటూ ప్రకటించారు. మద్దతు అంటే తన పార్టీని టీడీపీలో విలీనం చేయడమో.. లేదా ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబుకు మద్దతు ఇవ్వడమో కాదు.. గత కొన్ని రోజుల నుంచి చంద్రబాబు మొత్తుకుంటున్నారు కదా.. అన్ని వీవీప్యాట్ల స్లిప్పులను కూడా లెక్కంచాలంటూ ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు కదా.. ఆ విషయమై పవన్.. చంద్రబాబుకు మద్దతు ఇచ్చారన్నమాట. ఈవీఎంలతో పాటు.. అన్ని వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న చంద్రబాబుకు తాను కూడా మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారు.

మరి.. మీరు పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల సంగతేంటి పవన్ అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే.. నేను పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వస్తుందని చెప్పలేను. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతారు.. అందరిలా నేను ఊహాగానాలు చేయను. ఆ అవసరం కూడా నాకు లేదు.. అంటూ తప్పించుకున్నారు పవన్.