అందరి దారి ఒకవైపు అయితే, నా దారి మరో వైపు అని బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే ఆమె తొలి నాళ్ళ నుంచి కెరీర్ సాగించిన విధానం డిఫరెంట్ అనే చెప్పాలి. ఏ కథానాయిక అయినా ఎక్కువ కాలం రాణించాంటే కమర్షియల్ సినిమాలతోపాటు సాధ్యమైనప్పుడల్లా నటనకు స్కోప్ ఉన్న సినిమాలు, నటనా ప్రతిభని చాటే పాత్రలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అనుష్క శర్మ ముందే ఉంది. తను కథానాయికగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘రబ్ నే బనా ది జోడీ’. తొలి చిత్రమే షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో ముక్కుసూటి తనం, ఇన్నోసెంట్ కలగలిపిన పాత్రతో బాలీవుడ్ ఆడియెన్స్ ని ఫిదా చేసింది. రొమాంటిక్ కామెడీగా దర్శకుడు ఆదిత్య చోప్రా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
నటిగా తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఏడాది గ్యాప్‌తో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి చేసిన రొమాంటిక్ కామెడీ ‘బ్యాండ్ బాజా బారాత్’ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతో అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగని అనుష్క వరుసగా కమర్షియల్ సినిమాలు చేయలేదు. అందాల ఆరబోతకే పరిమితం కాలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకుంటూ ఇప్పుడు అగ్ర కథానాయికగా ఎదిగింది. భిన్నమైన సినిమాలు చేస్తూ రాణిస్తోంది. రెండేండ్ల క్రితం టీమ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీని పెళ్ళి చేసుకున్నాక నటించాల్సిన అవసరం లేదు. కానీ యాక్టింగ్, సినిమా అంటే ప్యాషన్. అలాగని టైమ్ పాస్‌కి నటించాలనుకోవడం లేదు. యాక్టింగ్ అంటే తాను చాలా సీరియస్‌గానే తీసుకుందట. ఇటీవ ఓ కార్యక్రమంలో అనుష్క మాట్లాడుతూ,‘గతేడాది నుంచి సినిమా విషయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నా. కేవలం నా నటనను తెరపై చూపించడం కోసం నేను యాక్టింగ్ చేయడం లేదు.
టైమ్ పాస్ కోసమో నటించడం లేదు. ఓ భిన్నమైన పాత్ర పోషించాంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. పాత్ర కోసం ఎంతో ప్రిపరేషన్ చేయాలి. దానికి న్యాయం చేసేందుకు నిరంతరం శ్రమించాలి. పాత్రలో లీనమై నటించాలి. అందుకు తగ్గట్టుగా బాడీని కూడా మార్చుకోవాలి. అది అంత ఈజీ కాదు. అందుకే ఇప్పుడు కాస్త సెలక్టీవ్‌గా వెళ్తున్నా. వేగంగా చేయాల్సిన అవసరం నాకేం లేదు’ అని స్పష్టం చేసింది. అనుష్క గతేడాది ‘పరి’, ‘సంజు’, ‘జీరో’,‘సూయిదాగా’ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మరే సినిమాకి ఇంకా సైన్ చేయలేదు. మరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.