ఏపీ సీఎం జగన్ క్రైస్తవుడన్న సంగతి అందరికీ తెలిసిందే. జగనే కాదు.. ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి.. కూడా క్రైస్తవుడే. జగన్ తాతల నుంచి కూడా వారు క్రైస్తవం పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రైస్తవంపై కూడా విమర్శలు చేస్తున్నారు కొందరు నేతలు. జగన్ క్రైస్తవుడైనా హిందూ మత సంప్రదాయాలనూ పాటిస్తారు. అంతే కాదు..హిందూ స్వామీజీలకు ఇటీవల ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు కూడా.
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ క్రైస్తవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు సంబోధించడాన్ని ఆక్షేపిస్తూ పవన్ కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ క్రైస్తవుడని.. కానీ క్రైస్తవంలో కులాలు ఉండవని ఆయన గుర్తు చేశారు. క్రైస్తవంలో కులాలు లేనప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరులో రెడ్డి ఎందుకని ప్రశ్నించారు.
అంతేకాదు.. జగన్ తిరుపతికి వెళ్లి లోపల పూజలు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆయన సంప్రదాయాన్ని గౌరవిస్తారని అందుకు ఆయన్ను మెచ్చుకోవాలి అంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా… జగన్ తిరుపతి లడ్డూ తింటారో లేదో .. లేక అవి ఢిల్లీ వెళ్లి అమిత్ షాకు ఇచ్చుకోవడానికి పనికొస్తున్నాయో.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను వ్యక్తిగత విమర్శలకు వ్యతిరేకం అంటూనే పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలు గుప్పించారు.
సీఎంను జగన్ రెడ్డి అని పిలిస్తే కోపం వస్తుంది కాబట్టి.. ఎలా పిలవాలో వైకాపా ఎమ్మెల్యేలంతా తీర్మానించుకుని చెప్పాలని పవన్ కల్యాణ్ సూచించారు. మీరు ఎలా పిలవమంటే అలానే పిలుస్తా అంటున్నారు పవన్. తెలుగుభాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని ఉద్దేశపూర్వకంగానే అన్నానని పవన్ గుర్తు చేశారు. చివరకు నాయకుల కుల, మతాలు కూడా రాజకీయ విమర్శలకు నెలవుగా మారుతున్నాయి.