జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడుగా మారిపోయారు. పార్టీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నేతల్లో దైర్యం నింపి, రాజకీయంగా మరింత బలోపేతం అయ్యేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో అకస్మాత్తుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ముందుకు రావడం, ఈ మేరకు జనసేన అభ్యర్థులను ప్రకటించడం, బి జె పి తో పొత్తు లేకుండా, ఒంటరిగా పోటీ చేసేందుకు ముందుకు వెళ్లడం కలకలం రేపాయి.
ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న సమయంలో , గ్రేటర్ లో పవన్ ఏ దైర్యంతో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నారు అనే విషయం ఎవరికీ అంతుపట్టలేదు. అయితే అకస్మాత్తుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాము అని చెప్పి బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే బిజెపి రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరపడం, ఆ తర్వాత ఈ ప్రకటన వెలువడడం జరిగాయి. ఇది ఇలా ఉంటే, పవన్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ టూర్ లో ఏం సంచలనం సృష్టించబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఆకస్మాత్తుగా పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన త్యాగం చేసింది కాబట్టి, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో జనసేన పోటీ చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్ తో పవన్ డిల్లీకి వెళ్లినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేసే అభ్యర్థి గా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించడం, వైసిపి డాక్టర్ గురుమూర్తి పేరును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు బిజెపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎవర్ని అభ్యర్థిగా దింపుతారు ? జనసేన, బిజెపి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడ రంగంలోకి దిగుతారు ? అనేది క్లారిటీ లేదు. అయితే తాము చేసిన త్యాగానికి, ప్రతిఫలం తిరుపతిలో పోటీ చేసే అవకాశం తమకు కల్పించాలి అనే డిమాండ్ తో పవన్ ఢిల్లీ కి వెళ్లినట్లు, ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టి జనసేన అభ్యర్థిని ఇక్కడ రంగంలోకి దించాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో బిజెపి కేంద్ర పెద్దలు ఎంతగా ఒత్తిడి చేసినా, వెనక్కి తగ్గకూడదనే అభిప్రాయం లో ఆయన ఉన్నారట. పవన్ డిల్లీ టూర్ సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డ తో పాటు, అనేక మంది కేంద్ర మంత్రులను పవన్ కలవబోతున్నారట. తిరుపతి టికెట్ జనసేనకే అని పవన్ తో పాటు దాదాపు జనసెనికులు ఫిక్స్ అయిపోయారట.
-Surya