టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ పైకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న…లోపల మాత్రం పొత్తు విఫలమై ఓడిపోతామని భయపడుతున్నారా? టిడిపి-జనసేన శ్రేణులు సరిగ్గా కలిసి పనిచేయరని టెన్షన్ పడుతున్నారా? అంటే పరిస్తితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. అందుకే జనసేన శ్రేణులు..టిడిపితో గొడవలు పెట్టుకోవద్దని పదే పదే చెబుతున్నారు. అటు టిడిపి వాళ్ళు కూడా జనసేనని కలుపుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
తాజాగా మచిలీపట్నంలో జనసేన శ్రేణుల సమావేశంలో పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టిడిపి-జనసేన శ్రేణులు పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్లాలని, మనలో మనం గొడవపడితే మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని, మన మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ నేతలు కాచుకుని కూర్చున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదని చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టిడిపిని తక్కువ అంచనా వేయకూడదని జనసేన శ్రేణులకు సూచించారు. దీని బట్టి చూస్తే పొత్తులో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ భావిస్తున్నారు. ముఖ్యంగా సీట్ల పంపిణీ విషయంలో రచ్చ నడిచే ఛాన్స్ ఉంది.
అలాగే ఓట్లు బదిలీ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అది కూడా జనసేనకు కేటాయించే సీట్లలో టిడిపి ఓట్లు బదిలీ అనేది చాలా కష్టం. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన ఒక సీటు గెలిచింది. మూడు సీట్లల్లో మాత్రమే టిడిపి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచింది.
అంటే మిగిలిన మొత్తం సీట్లలో టిడిపిది రెండో స్థానం. ఆ పార్టీకి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జనసేన పోటీ చేసే చోట టిడిపి ఓట్లు పూర్తిగా బదిలీ కావాలి. అలా కాకుండా అక్కడ స్థానికంగా టిడిపి, జనసేనల మధ్య గొడవలు ఉంటే ఓట్లు బదిలీ జరగదు. పొత్తుకు నష్టం. వైసీపీకి లాభం.