రాజకీయ నేతలు ప్రధాన రోడ్డు కూడళ్లలో భారీ సభలు పెట్టడం, రోడ్ షోలు నిర్వహించడం సర్వ సాధారణమే. పైగా ఎన్నికల సమయంలో నేతలంతా రోడ్లపైనే సభలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది. దీంతో ప్రతిపక్ష నేతలు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. ఓ వైపు చంద్రబాబు ఇప్పటికే పలు కార్యక్రమాలతో రోడ్ షోలు నిర్వహించారు. బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా సాగునీటి ప్రాజెక్టులని పరిశీలిస్తూనే భారీ సభలు నిర్వహిస్తున్నారు.
ఇటు లోకేష్ సైతం పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో రోడ్డుపైనే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వ పరమైన కార్యక్రమాలతో..భారీ బహిరంగ సభలు ఖాళీ ప్రదేశాల్లో పెట్టుకుంటున్నారు. ఇక పవన్ వారాహి యాత్ర పేరుతో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల టూర్ ముగించి..మూడో విడత ఉత్తరాంధ్రలో మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖ నగరంలో 10వ తేదీన వారాహి యాత్ర మొదలుపెడుతున్నారు. అలాగే అక్కడ నిత్యం రద్దీగా ఉండే జగదాంబ సెంటర్ లో సభ నిర్వహిస్తున్నారు.
దీనికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అక్కడ సభ మాత్రమే పెట్టుకోవాలని, ర్యాలీలు నిర్వహించకూడదని, పవన్ వెహికల్ తో ఏ ఇతర నేతల వెహికల్ ఉండకూడదని చెప్పారు. అయితే మొత్తం మీద రద్దీగా ఉండే జగదాంబ సెంటర్ లో సభ అంటే భారీగా జనం రావడం ఖాయం. అప్పటిలో ఇక్కడ ఎన్టీఆర్ మాత్రమే సభలు నిర్వహించే వారు. చంద్రబాబు గాని, వైఎస్సార్, జగన్ సైతం రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి వేరే ప్లేస్ లో సభలు నిర్వహించే వారు.
కానీ ఇప్పుడు పవన్ సభ నిర్వహిస్తున్నారు. విశాఖ జగదాంబ సభపైనే అందరి దృష్టి ఉంది. మామూలుగానే పవన్ సభలకు భారీగా జనం వస్తారు. ఇప్పుడు జగదాంబలో ఏ స్థాయిలో జనం వస్తారనేది చూడాలి.