పవన్ విషయమై టీడీపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. నేరుగా బరిలోకి దిగకుండా పవన్ ను నియంత్రించేందుకు కొన్ని ఆలోచనలు చేస్తోంది. అందుకే తెలుగు తమ్ముళ్లు అంతా మైత్రి వద్దు అప్పటిలానే మద్దతు చాలు అని అంటున్నారు. కానీ జనసేన మాత్రం ఈ సారి పోటీ చేసి తీరుతామనే అంటోంది. దీంతో పవన్-కూ, టీడీపీకీ ఎక్కడో చెడిందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా బస్సు యాత్రకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఎలా చూసుకున్నా ఏ విధంగా మాట్లాడుకున్నా బీజేపీతో అయితే జనసేన పొత్తు ఉంటుంది కానీ టీడీపీతో మాత్రం అస్సలు సీట్ల బేరం కుదిరేలా లేదు అని తేలిపోయింది. దీంతో రానున్న ఎన్నికల్లో మళ్లీ పవన్ కారణంగానే వైసీపీ మరింత ఎక్కువ సీట్లు గెల్చుకునేందుకు అవకాశం ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ పూర్తిగా కుటుంబ పాలనలో ఉన్న పార్టీలతో సఖ్యత పెంచుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో రానున్న కాలంలో టీడీపీతో బేరం పెట్టుకోదు. కనుక గెలిచినా, ఓడినా పవన్-తోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉంది. అదేవిధంగా చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకున్నా కూడా బీజేపీ ఎదుగుదలకు నాటి పొత్తు పెద్దగా కలిసి రాలేదు. కానీ చంద్రబాబు మాత్రం తెలివిగా ఢిల్లీలో తన పనులు అన్నీ చక్కగా చక్కబెట్టుకున్నారన్న ఆరోపణలు అయితే అప్పట్లో బీజేపీ నుంచి వినిపించాయి.
పొత్తులో భాగంగా ఒకట్రెండు మంత్రి పదవులు ఇచ్చినా వాళ్లేం బీజేపీ ఎదుగుదలకు సహకరించిన వారయితే కాదని తేలిపోయింది కూడా ! దేవాదాయ ధర్మా దాయ శాఖ చూసిన మాణిక్యాల రావు వివాద రహితుడే కానీ బలమైన గొంతుక ఉన్న నేత కాదని స్పష్టం అయింది. ఇక వైద్యారోగ్యం చూసిన కామినేని కూడా బాబుకు ఫక్తు ఏజెంట్-గానే ఉండిపోయారు అన్నది ఇప్పటికీ రాజకీయ విశ్లేషకుల వినిపించే విమర్శ. కనుక ఈ సారి చంద్రబాబును నమ్ముకుని లాభం లేదని బీజేపీ ఫిక్స్ అయిపోయింది. అదే కనుక జరిగితే వైసీపీదే తరువాత కాలంలో అంటే 2024 ఎన్నికల్లో విజయం అని విశ్లేషకులు అంటున్నారు.ఆ విధంగా పవన్, ఆ విధంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ (ఏపీ) సోము వీర్రాజులు కలిసి జగన్ కు ఎంతో కొంత సాయం చేయడం అయితే ఫిక్స్ అని కూడా ఓ వాదన రాజకీయ వర్గాల నుంచి వినవస్తోంది.