తెలంగాణపై పవన్ ఫోకస్..ఆ 32 స్థానాల్లో పోటీ..బీజేపీతో పొత్తు లేదా?

ఏపీ రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేసి..అక్కడ సత్తా చాటాలనే దిశగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..తెలంగాణలో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాకపోతే తెలంగాణలో జనసేనకు పెద్ద బలం లేదు. కానీ ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములని ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. అందుకే ఆ సీట్లలో పోటీ చేయాలని చెప్పి అక్కడ ఉండే జనసేన నేతలు పవన్‌ని కోరుతున్నారు.

యితే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తామని పవన్‌ని కోరారు గాని..అక్కడ వచ్చే ఓట్లు వల్ల ఉపయోగం ఉండదని కాబట్టి పోటీకి దూరంగా ఉండాలని కోరారు. అలాగే పార్టీకి ఎక్కడ బలం ఉందో..ఆ నియోజకవర్గాల లిస్ట్‌ని తయారు చేయాలని పవన్..తెలంగాణ జనసేన నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే తాజాగా 32 స్థానాల లిస్ట్‌ని జనసేన నేతలు తయారు చేశారు. అలాగే ఆ 32 స్థానాల్లో కార్యనిర్వాహక అధ్యక్షులని నియమించారు.

ఎంపిక చేసిన కార్యనిర్వాహకులంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయాలని పార్టీ నాయకత్వం సూచించింది. నివేదికలు అందిన అనంతరం.. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను పవన్ ప్రకటించనున్నట్టు తెలిసింది. అయితే తెలంగాణలో జనసేన పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీజేపీతో జనసేనకు పొత్తు లేదు. ఏపీలో మాత్రం పొత్తు ఉంది. దీంతో తెలంగాణలో జనసేన సింగిల్ గా వెళ్ళే ఛాన్స్ ఉంది.

కానీ జనసేన పోటీ వల్ల ఎంతోకొంత బీజేపీకి మైనస్ అవ్వచ్చు. అలా అని బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. దీంతో బీజేపీ అధిష్టానం పవన్‌తో మాట్లాడి పోటీ లేకుండా చేయడం లేదా పొత్తు ఉండేలా మాట్లాడుకోవడం, అది కాదు అంటే పవన్ సపోర్ట్ మాత్రమే తీసుకునేలా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో జనసేన సింగిల్ గా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి.