కేటీఆర్ సాయం కోరిన పీసీసీ చీఫ్‌.. ఇమీడియెట్‌గా సాయం చేస్తాన‌న్న మంత్రి

ఈ క‌రోనా స‌మ‌యాల్లో ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇష్టం వ‌చ్చిన‌ట్టు బిల్లులు వేస్తూ జ‌నాల‌ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. బిల్లులుక‌డితే గానీ శ‌వాల‌ను కూడా ఇవ్వ‌కుండా దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హైదరాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చనిపోయారు. ఇతను కర్ణాటకలోని మండ్యకు చెందిన శశికళ అనే మహిళకు భర్త.

 

ఇక చనిపోయిన శశికళ భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు రూ.7 లక్షలు కడితే గానీ ఇవ్వబోమంటూ మెడిక‌వ‌ర్ ఆసుపత్రి యాజమాన్యం దౌర్జ‌న్యానికి దిగింది. దీంతో ఆ మ‌హిళ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కి విష‌యం చెప్పి వేడుకోవాల‌ని కోరింది.

దీంతో స్పందించిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ ట్విట్ట‌ర్ ద్వారా విష‌యాన్ని కేటీఆర్‌కు వెల్ల‌డించారు. స‌ద‌రు ఆస్ప‌త్రి చేస్తున్న వేధింపుల‌ను విరించారు. 7 లక్షల రూపాయలు కడితే కానీ మృతదేహాన్ని అప్పగించబోమ‌ని చెప్తున్నారని, బాధిత కుటుంబ సభ్యులుకు న్యాయం చేయాల‌ని కేటీఆర్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ శివకుమార్ ట్వీట్ చేశారు. స్పందించిన మంత్రి త‌న ఆఫీసు వారు ఆస్ప‌త్రితో కాంటాక్ట్ అవుతార‌ని చెప్పారు. ఆ మ‌హిళ నెంబ‌ర్ ఇవ్వాల‌ని కోరారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.