టీఆర్ఎస్‌ని వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు, ప్రత్యర్ధులు పెరుగుతున్నారు. మొన్నటివరకు తన సహచరులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు, ఈటల టార్గెట్‌గా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అలాగే హుజూరాబాద్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి సైతం, అధికార టీఆర్ఎస్‌ని వదిలేసి ఈటలపైనే విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా తానే ఈటలకు ప్రత్యర్ధిని అని చెప్పుకుంటున్నారు.
ఇదే సమయంలో దశాబ్దాల పాటు టీడీపీలో ఉండి, తర్వాత బీజేపీలోకి వచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి సైతం ఈటలపైన పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి హుజూరాబాద్ నుంచి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. ఆ తర్వాత నుంచి పెద్దిరెడ్డికి రాజకీయంగా కలిసిరాలేదు. పైగా రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి బీజేపీలోకి వచ్చేశారు.
అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో తానే బీజేపీ తరుపున హుజూరాబాద్‌లో పోటీ చేసే నాయకుడు అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ నుంచి ఈటల బయటకొచ్చి, బీజేపీలో చేరారు. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఇక ఈ ఉపపోరులో ఈటల రాజేందర్ బీజేపీ తరుపున బరిలో దిగనున్నారు.
అయినా సరే పెద్దిరెడ్డి, బీజేపీ ఆదేశిస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తానని హడావిడి చేస్తున్నారు. ఇక ఈయనకు ఏ మాత్రం పోటీ చేసే అవకాశం రాదు. అయినా సరే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని బీజేపీ శ్రేణుల్లో అనుమానం వస్తుంది. కేసీఆర్ దృష్టిలో పడేందుకే పెద్దిరెడ్డి ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే హుజూరాబాద్‌లో పెద్దిరెడ్డి బలం ఎప్పుడో తగ్గిపోయిందని, ఆయన వల్ల ఈటలకు ఎలాంటి నష్టం జరగదని, ఈటల అనుచరులు అంటున్నారు. పెద్దిరెడ్డి ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్‌కు సపోర్ట్ ఇచ్చిన పెద్దగా ఉపయోగం ఉండదని చెబుతున్నారు. మొత్తానికైతే పెద్దిరెడ్డి వల్ల ఈటలకు నష్టం జరగదని అంటున్నారు.