వర్మ సంగతేంటి….? నామినేట్ పదవి దక్కుతుందా

-

పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మకు ఏ పదవి దక్కుతుంది.. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తొలుత టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక కేడర్‌ వ్యతిరేకించినా, వర్మ మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారు. అధినేత ఆదేశాలతో పవన్‌ గెలుపునకు శక్తివంచన లేకుండా పనిచేశారు. ఇక పిఠాపురంలో పవన్‌ను కట్టడి చేయాలని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ, స్థానికంగా వర్మ అన్నింటిని ఒక్క చేత్తో ఎదుర్కొన్నారు. పవన్‌ గ్లామర్‌…. తన రాజకీయ వ్యూహాలతో పిఠాపురంలో భారీ విజయం సాధించి పెట్టారు. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని సవాల్‌ చేసిన వైసీపీకి మైండ్‌ బ్లాక్‌ అయ్యేలా ఏకంగా 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చింది.

ఇదే సమయంలో వర్మకు ఏ పదవి ఇస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీడీపీ,జనసేన కార్యకర్తలు.ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కావస్తుండటంతో వర్మకు ఇచ్చే పదవిపై విస్తృత చర్చ జరుగుతోందిప్పుడు.తాజాగా ఎన్నికలు జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి వర్మకే అన్న ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వర్మకు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్సీ పదవి వర్మకే ఇస్తామని మాటిచ్చారు. కానీ, తొలి విడతలో వర్మకు చాన్స్‌ దక్కలేదు. అయితే తొలి విడత ఎమ్మెల్సీ అవకాశాన్ని వర్మ వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితికి ఎన్నిక జరుగుతోంది. ఈ పదవిని వర్మ తీసుకుంటే మరోసారి చాన్స్‌ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ అవకాశం కన్నా తన నియోజకవర్గానికి మేలు జరగాలన్నదే తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారట వర్మ. ఏలేరు రెండో దశ విస్తరణకు నిధులు విడుదల చేయాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు…. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను వర్మ కోరారు.

తన పదవి కన్నా, నియోజకవర్గ అభివృద్ధికి వర్మ నిధులు అడగటంతో ఇద్దరు అధినేతలు ఒకింత ఆశ్యర్యానికి లోనయ్యారంటున్నారు.దీంతో వర్మకు తగిన గౌరవం ఇచ్చేలా నామినేటెడ్‌ పోస్టులో నియమించాలని చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో వర్మకు ఇచ్చిన మాట ఒక్కటే కాకుండా.. క్షత్రియ సామాజికవర్గానికి తగినన్ని సీట్లు కేటాయించలేకపోయారని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి. ఇటు వర్మకు ఇచ్చిన మాటతో పాటు అటు క్షత్రియ సామాజికవర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఎమ్మెల్సీ అవకాశంతోపాటు ఏదైనా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న వర్మను ఏ పదవి వరించబోతోందోనని ఇరు పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news