తెలంగాణలో బలపడటమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ..అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇవ్వనుంది. అది కూడా ఖమ్మం జిల్లాలో భారీ దెబ్బ కొట్టనుంది. ఎప్పటినుంచో ఖమ్మంలో బలం పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది. ఇదే క్రమంలో అక్కడ కొందరు బడా నేతలపై గేలం వేసింది. అది కూడా కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలని టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారు దిగి..కాషాయ జెండా కప్పుకోవడానికి రెడీ అయ్యారు.
2014లో పొంగులేటి వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు..తర్వాత గులాబీ పార్టీలోకి వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గాని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గాని ఈయనకు సీటు దక్కలేదు. అలాగే ఎమ్మెల్సీ రాలేదు. అటు రాజ్యసభ దక్కలేదు. అయినా పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో సీటు గ్యారెంటీ లేకుండా పోయింది..దీంతో పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయమైంది. జనవరి 18న ఖమ్మంలో కేసీఆర్ సభ పెట్టిన రోజే పొంగులేటి బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది.
అయితే ఇటీవల జనవరి 1వ తేదీన..పొగులేటి అనుచరుల సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేసీఆర్ బొమ్మ ఉంది.కానీ తాజాగా సమావేశంలో కేవలం పొంగులేటి బొమ్మ మాత్రమే ఉంది. దీని బట్టి చూస్తే పొంగులేటి కమలంలోకి జంపింగ్ ఖాయమైపోయింది. పైగా తనతో పాటు కొందరు కీలక నేతలని బీజేపీలోకి తీసుకెళ్తారని తెలుస్తోంది. తనకు ఖమ్మం ఎంపీ సీటుతో పాటు అనుచర నేతలకు సీట్లు దక్కేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.
పాయం వెంకటేశ్వర్లు-పినపాక, మట్టా దయానంద్-సత్తుపల్లి, కోరం కనకయ్య-ఇల్లందు..ఇంకా కొందరు నేతలని బీజేపీలోకి తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే పొంగులేటి మాత్రమే జంప్ అవ్వకుండా..ఇతర నేతలని కూడా తీసుకెళితే ఖమ్మంలో కారు పార్టీకి డ్యామేజ్ తప్పదు. అసలే ఖమ్మంలో కారు పార్టీకి బలం తక్కువ. గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచింది..ఇతర పార్టీ ఎమ్మెల్యేలని లాక్కుని తర్వాత బలపడింది. ఇప్పుడు బడా నేతలు బయటకు వెళితే..కేసీఆర్ భారీ సభలు పెట్టిన ఖమ్మంలో కారుకు నష్టం తప్పదు.