డెబ్బై ఏళ్ల ప్రస్థానం ఉన్న రాజకీయ పార్టీ.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు(ప్రస్తుతం ఆరోది) అధికారంలో ఉన్న పార్టీ. తమిళ నాట సూర్యోదయ పార్టీగా పేరుపొందిన ద్రవిడ మున్నేట్ర కజగం. తమిళులు ఆరాధ్యంగా భావించిన ఈ పార్టీ ఇప్పుడు మరోసారి విజయ ఢంకా మోగించింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న స్టాలిన్ టీం.. ఇప్పుడు తిరుగులేని మెజార్టీతో సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో మొదటిసారి ఆయన సీఎం కాబోతున్నారు.
234 సీట్లున్న తమిళంలో 133 స్థానాలను డీఎంకే తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 50ఏళ్ల తర్వాత ఇంతటి అఖండ విజయాన్ని నమోదు చేసింది. దీనికి స్టాలిన్ కఠోర శ్రమే కారణం. ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, సమస్యలపై వినతులు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతోనే ఇంతటి భారీ మెజార్టీ వచ్చిందని చెబుతున్నారు. ఇదంతా స్టాలిన్ దశాబ్ద కాలంగా చేస్తున్న శ్రమకు గుర్తింపు అని తమిళులు పొగుడుతున్నారు.
రాజకీయ దిగ్గజం కరుణానిధి కొడుకుగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టాలిన్.. కింది స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చారు. మేయర్ గా, పార్టీ ఫ్లోర్ లీడర్ గా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు తొలిసారి సీఎం కాబోతున్నారు. ఇక ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచాడు. ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఇక స్టాలిన్ కు దేశవ్యాప్తంగా నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.