ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిది అనే అంశంపై ఉత్కంఠకు తెరదించింది ఆరా మస్తాన్ సర్వే.వరుసగా రెండోసారి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారని అంచనా వేసింది.2019తో పోలిస్తే ఈసారి సీట్లు తగ్గినా వైసీపీ ప్రభుత్వమే వస్తుందని తేల్చేశారు.మహిళా ఓటర్లు ఎక్కువగా వైసీపీకి అండగా నిలిచారని తన సర్వేలో పేర్కొన్నారు.అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్,బీజేపీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడిచిందని తేల్చేశారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే బరిలో దిగింది.ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచిని ప్రధాన అస్త్రంగా చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ,జనసేనలో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్ళింది.మూడు పార్టీలు కలిసి వచ్చినా మహిళల మనసు గెలుచుకోలేకపోయారని ఈ సర్వేని చూస్తే అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో ఓటు వేసిన మహిళలు వైసీపీకి అండగా నిలిచారని ఆ పార్టీ నేతలు చెప్తుండగా ఆరా మస్తాన్ సర్వే కూడా ఇదే కన్ఫర్మ్ చేసింది. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలకం అయ్యారని పేర్కొంది.మొత్తానికి ఈ సర్వే ప్రకారం చూస్తే వైసీపీ 94-104 ఎమ్మెల్యే సీట్లను గెలుస్తుందని తెలుస్తోంది.టీడీపీ కూటమి 71-81స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చేసింది.అలాగే వైసీపీ 13-15, కూటమి 10-13 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తాయని అంచనా వేశారు.ఈ సర్వేతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇక తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి మధ్య నెక్ టు నెక్ పోరు నడిచింది.డబుల్ డిజిట్ ఆశించిన బీజేపీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినా 8-9 ఎంపీలను గెలుస్తుందని అంచనా వేశారు.ఇక కాంగ్రెస్ 7-8 స్థానాలను ఖాతాలో వేసుకుంటుందని తేల్చేశారు.ప్రతిపక్ష బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాకపోవచ్చని కుండబద్దలు కొట్టింది ఈ సర్వే.ఎంఐఎం ఒక్క సీటు గెలుస్తుందని ప్రకటించారు.ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ నిజం కావని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా లోక్ సభ పోరులో మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ ఎలాంటి కామెంట్లు చేయలేదు. అసలు విషయం తేలాలంటే కౌంటింగ్ వరకు ఆగాల్సిందే.