పోలీసుల అవివేకంతో మీడియా సంస్థల గగ్గోలు

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియా సేవలను అత్యవసర సర్వీసులుగా ప్రకటించాయి. దురదృష్టవశాత్తు ఈ విషయం పోలీసులకు అర్థం కావడం లేదు.ఒక పత్రిక గానీ, ఒక చానెల్‌ గానీ, బయటకు రావాలంటే సవాలక్ష విభాగాలు పనిచేయాలి.రిపోర్టర్‌ రాయగానే, ఫోటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించగానే పేపర్‌ బయటికి రాదు.

కరోనా వ్యాప్తి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అరుదైన, కఠిన నిర్ణయాలు తీసుకుంటే, ఈ సిగ్గు లేని జనాలు మాత్రం అవేవో కొంపలు మునిగిపోయినట్లు జనతా కర్ఫ్యూ పూర్తవగానే పొలోమంటూ రోడ్లమీదకి వచ్చేసారు. ఈ నిర్ణయాలన్నీ కేవలం మన ఆరోగ్యం కోసమే అనే కనీస స్పృహ ప్రజల్లో లేకపోవడం కడు విషాదం.

నిన్న ఉదయం జనతా కర్ఫ్యూ సడలించగానే కుప్పలుతెప్పలుగా రోడ్లపై జనం ఉండటం ప్రధానిని, తెలంగాణ ముఖ్యమంత్రిని తీవ్రంగా బాధించింది. హైదరాబాద్‌లో జనం చాలా మామూలుగా అసలేం జరగనట్లు, తాము రోడ్ల మీద వెలగబెట్టాల్సిన రాచకార్యాలేవో మిగిలిపోయినట్లు హడావుడిగా బయటకు వచ్చారు. నిజానికి, ఆఫీసులు లేవు, కాలేజీలు లేవు, షాపులు లేవు, ముఖ్యంగా బార్లు-వైన్‌షాపులు లేవు… మరి దేనికోసం ఈ వెంపర్లాట? ఓ పక్క కరోనా కేసులు పెరుగుతూపోతున్నాయి. దేశాలకు దేశాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఇటలీలో జనం పిట్టల్లా రాలుతున్నారనే వార్తలు పేపర్లలో, టీవీల్లో చూస్తూనేఉన్నారు. అయినా తీవ్ర నిర్లక్ష్యం. తమకేంకాలేదు కదా అనే ధీమా.

దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమై రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరమయితే తప్ప ఎవరూ బయటికి రాకూడదని ఆంక్షలు విధించారు. దీన్లో భాగంగా కొన్నిసేవలను అత్యవసరాలుగా భావించి మినహాయింపునిచ్చారు. వాటిలో మీడియా కూడా ఒకటి.

వార్తాపత్రికలు, న్యూస్‌ చానెళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉపయుక్తం. సోషల్‌మీడియా నిండా పుకార్లు, అబద్ధపు రాతలు, నిర్లక్ష్యపు నిందలు నిండిపోతున్న సమయంలో విశ్వసనీయమైన సమాచార స్రవంతి ఒక్క వార్తాపత్రికలు, పెద్ద న్యూస్‌ చానెళ్లు మాత్రమే. నమ్మదగ్గ సమాచారం పేపర్ల ద్వారానే ప్రజలకు అందుతుంది. ఈ సేవలు ప్రజలకు ఎంతో అవసరమని భావించిన ప్రభుత్వాలు మీడియా సంస్థల కార్యకలాపాలకు ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు ఏర్పడరాదని, వాటిని కూడా అత్యవసర సర్వీసులుగా పరిగణించాలని  ఆదేశాలు జారీ చేసాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్తితి మరోలా ఉంది.

వార్తాపత్రికలు చానెళ్లలో పనిచేసేవారిని కూడా డ్యూటీకి వెళ్తున్న సమయంలో, వస్తున్న సమయంలో పోలీసులు అడ్డగించి, వాగ్వాదానికి దిగుతున్నారు. గుర్తింపు కార్డు చూపినా వదలడంలేదు. ‘‘నువ్వు రిపోర్టర్‌వి కాదు కదా.. నీకేం పని? అంటూ పత్రికలోని ఇతర విభాగాలవారిని పోనివ్వడం లేదు. ఒక పత్రిక గానీ, ఒక చానెల్‌ గానీ, బయటకు రావాలంటే సవాలక్ష విభాగాలు పనిచేయాలి. అందులో సబ్‌ ఎడిటర్లు, విడియో ఎడిటర్లు, మిక్సర్లు, స్కానింగ్‌ వాళ్లు, మిషన్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు, హెచ్‌ఆర్‌, స్టోర్స్‌, సర్క్యులేషన్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌… ఇలా చాలా తతంగం ఉంటుంది. రిపోర్టర్‌ రాయగానే, ఫోటోగ్రాఫర్‌ క్లిక్‌మనిపించగానే పేపర్‌ బయటికి రాదు. ప్రతీరోజు రాత్రిపూట ఒక యుద్ధం జరుగుతుంది. దాదాపు సమాజమంతా జీవితకాలంలో చూడని సమయాల్లో వారు పనిచేస్తారు. వీరందరూ ‘‘ప్రెస్‌’’లో భాగమే. వీరిలో ఎవరు లేకపోయినా ఏ  పేపరూ రాదు, ఏ చానెళూ కనబడదు.

దురదృష్టవశాత్తు పోలీసులకు ఈ విషయం తెలియదు. తెలిసినా, స్వతహాగా ఉండే జులుం ఎలాగూ ఉంటుంది. పైపెచ్చు కరోనా మూలంగా విస్తృతమైన అధికారాలు చేతికొచ్చాయి. ప్రెస్‌ ఐడీకార్డు చూపితే వదిలేయని స్వయంగా డిజీపీ చెప్నినా వినడంలేదు. కేంద్ర ప్రభుత్వం నిన్న మీడియాకు, వాటి సిబ్బంది రాకపోకలకు, వాటి ముడిసరుకు రవాణాకు ఎటువంటి అడ్డంకులు సృష్టించరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత స్పష్టంగా ఉత్తరం రాసింది. అయినా, క్షేత్రప్థాయిలో ఉండే పోలీసులకు ఆ ఆదేశాలు చేరలేదు. కాగా, భౌతికదాడులకు సైతం దిగుతున్నారు. ఒక పత్రిక ఎలా తయారవుతోందో తెలియని అవగాహనాలేమితో పోలీసులు, పత్రికాసిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే, తిరిగితిరిగి అదో సమస్యగా మారుతుంది. అలా జరగకముందే, ఉన్నతాధికారులు మేల్కొని, కిందిస్థాయి పోలీసులకు తగువిధంగా కఠిన ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news