కరోనా వైరస్ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను చాలా జాగ్రత్తగా జరిగే విధంగా చూడాలని, అవసరం అయితే వాయిదా వేసుకోవాలని, మినహాయిస్తే మంచిది అని చంద్రబాబు సూచించారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు.
కేంద్ర హెచ్చరికలను ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా పాటించాలని చంద్రబాబు సూచించారు. హుదుద్ సమయంలో 50 కేజీల బియ్యం, నూనె, ఉప్పు, బంగాలదుంపలు ఇచ్చామని, నాలుగు వేలు ఇచ్చామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చెయ్యాలని, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కేరళ తెలంగాణా మాదిరి ఏపీ ప్రభుత్వం ప్యాకేజి ప్రకటించాలని చంద్రబాబు సూచించారు. అది అత్యవసరమని అన్నారు.
విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఆలస్యంగా క్వారంటైన్ చేసారని అన్నారు. వ్యవసాయం పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దెబ్బ తిన్నాయని అన్నారు. డిజిటల్ సోషలైజేషన్ కి ప్రాధాన్యత ఇవ్వాలని, డిజిటల్ వర్క్ చేసుకుంటే సమస్య నుంచి బయటపడతామని అన్నారు. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ ని వాడుకోవాలని చంద్రబాబు కీలక సూచన చేసారు. కేసులు మరిన్ని పెరుగుతాయని హెచ్చరించారు.