దళిత బందు ( Dalitha Bandhu Scheme )హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని పార్టీలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అయితే ఏకంగా అక్కడ ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాల హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం విశేషం. ఇక ఈ పథకం ప్రభావం నియోజకవర్గంలో ఉన్న ఇతర కులాల వారి మీద కూడా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ స్కీమ్ తమ పార్టీని గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో టీఆర్ఎస్ వర్గాల వారు ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ పథకం టీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. దళితులకు పది లక్షల చొప్పున డబ్బులను ఇస్తే మిగతా వారు కూడా తమ సామాజిక వర్గానికి ఈ పథకాన్ని అమలు చేయాలని పట్టుబడతారని అప్పుడు మొదటికే మోసం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా నియోజకవర్గంలో ఉన్న కొంత మంది దళితులు అసలు దళిత బంధు పథకాన్ని నమ్మడం లేదు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పథకం అమలులోనే ఉండదని తాము ఈ పథకాన్ని నమ్మడం లేదని కుండ బద్దలు కొడుతున్నారు.
ఇక నియోజకవర్గంలో ఉన్న మిగతా సామాజిక వర్గాల వారు తమను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించడం గమనార్హం. దళిత బంధు కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారని చాలా మంది భావిస్తుండటం వల్లే ముఖ్యమంత్రి తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేశారని చెబుతున్నారు. కానీ వాసాలమర్రి లో దళితుల జనాభా చాలా తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.