ఈటల ఎఫెక్ట్: ఆ విషయంలో హరీష్ అసంతృప్తి..?

తెలంగాణ అధికార టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ ఎలా బయటకొచ్చారో అందరికీ తెలిసిందే. కేసీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తూ, ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఈటలని భూ కబ్జాలు చేసారంటూ, పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఆయన కబ్జా చేశారో లేదో ఇంతవరకు తేలలేదు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే టీఆర్ఎస్‌లో నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగదని, త్వరలోనే మంత్రి హరీష్ రావు కూడా గెంటివేయబడతారని చెప్పి ఈటల మాట్లాడుతున్నారు.

అయితే ఈటల వ్యాఖ్యలని హరీష్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయినా సరే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయమైతే జరగడం లేదనే అసంతృప్తి హరీష్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్నవారిలో మెజారిటీ మంత్రులు ఉద్యమంలో లేనివారే. పైగా ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వచ్చేవారి విషయంలో కూడా హరీష్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకనే పార్టీ వలసలపై హరీష్ ఏ మాత్రం స్పందించడం లేదని తెలుస్తోంది.

ఇటీవల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఇద్దరు నాయకులు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలిసిందే. అటు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డిలు కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరు తెలంగాణ ఉద్యమం చేశారో లేదో కూడా తెలిసిందే. మరి ఇలా వేరే పార్టీ నేతలనీ చేర్చుకుంటూ టీఆర్ఎస్‌లో అసలైన ఉద్యమ నేతలకు న్యాయం జరగట్లేదనే భావన హరీష్‌లో ఉందని అంటున్నారు. ఏదేమైనా టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత తగ్గినట్లే కనిపిస్తోంది.