గ్రేటర్ హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రత్యేకమైనది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, పాతబస్తీతో కలిపి ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. రెండుసార్లు టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన ప్రకాష్ గౌడ్, గత ఎన్నికల్లో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. మూడోసారి కూడా బిఆర్ఎస్ తరఫున గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. ఈసారి కూడా కేసీఆర్ బీఐఆర్ఎస్ తరఫున ప్రకాష్ గౌడ్ కి ఇచ్చాడు. ఈ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక అనుచర గణాన్ని సమకూర్చుకున్నాడు. ప్రకాష్ గౌడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.
చేవెళ్లలో నుండి కొంత భాగం ఈ నియోజకవర్గం లో కలవడం వల్ల సబితా ఇంద్రారెడ్డి ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఉంటుంది. కానీ ప్రకాష్ గౌడ్‌కు, సబితా ఇంద్రారెడ్డికి మొదటి నుండి పడదు, సబితతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ని ఏర్పాటు చేసుకొని ముందుకెళుతున్నారు. ప్రకాష్ గౌడ్ ఈసారి గెలిచి నాలుగో సారి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటే, ఇప్పుడు ఓడించి తమ జెండా పాతాలని కాంగ్రెస్, బిజెపి రెండు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన జ్ఞానేశ్వర్ ఈసారి కూడా తనకే టికెట్ కావాలి అని కోరుకుంటున్నారు. జ్ఞానేశ్వర్ తో పాటు జైపాల్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ సిట్టింగ్ అభ్యర్థి బీసీ కావడం వల్ల కాంగ్రెస్ లో రోజురోజుకీ బీసీ నినాదం ఎక్కువగా ఉండటం వల్ల బీసీ అభ్యర్థి అయిన జ్ఞానేశ్వర్ కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బిజెపి తరఫున కార్పొరేటర్ రాజేష్ బైతి ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ సమస్యలు, తాగునీటి సమస్య, అభివృద్ధి సరిగా లేకపోవడం వంటి సమస్యలతో పాటు, ప్రకాష్ గౌడ్ భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకుని ప్రకాష్ గౌడ్ పై విజయం సాధించాలి అని కాంగ్రెస్, బిజెపి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఈ సారి రాజేంద్రనగర్ ఎవరి సొంతమవుతుందో చూడాలి.