వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ ఆరు స్థానాల్లో ఏపీకి నాలుగు, తెలంగాణకు రెండు స్థానాలు రానున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఖ్యా బలాలను బట్టి చూస్తే అన్ని సీట్లు అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కారు నెంబర్ 100 దాటేసింది. అక్కడ ఆ పార్టీకి గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు వచ్చినా ఇండిపెండెంట్లు, టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు.
ఇక ఏపీలో వైసీపీకి ఏకంగా 175 స్థానాలకు 171 సీట్లు వచ్చాయి. ఈ బలాలను బట్టి చూస్తే అటు ఏపీలోనూ… ఇటు తెలంగాణలోనూ అధికార పార్టీకే ఆ స్థానాలను దక్కించుకోనున్నాయి. అయితే, తెలంగాణ నుంచి ఖాళీ కాబోతున్న స్థానాల్లో టీఆర్ఎస్ సీనియర్ కె.కేశవరావు సీటు ఒకటి కూడా ఉంది. కేకే కు మళ్లీ రాజ్యసభ రెన్యువల్ కాదనే అంటున్నారు. కేకే ఇటీవల కేసీఆర్‌తో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. పైగా కేకే, డీఎస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల పార్టీకి ఎలాంటి యూజ్ అవ్వలేదన్న భావనలో కేసీఆర్ ఉన్నారట.
ఈ క్రమంలోనే అక్కడ టీఆర్ఎస్‌కు దక్కే రెండు రాజ్యసభ సీట్ల కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ ఒకటి మాత్రం మాజీ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవితకు దక్కుతుందని అంటున్నారు. మరో సీనియర్ నేత వినోద్‌కుమార్ కూడా రేసులో ఉన్నా.. ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వీరిద్దరికి రాజ్యసభ సీట్లు రావు. అయితే వినోద్‌కు ఇప్పటికే
కేబినెట్ ర్యాంక్ హోదాతో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఉండటంతో… రాజ్యసభకు పంపించకపోవచ్చనే అంటున్నారు.
ఈ క్రమంలోనే ఒక సీటు కవితకు దాదాపు ఫైనల్ అంటున్నారు. మరి రెండో సీటు విషయంలో ఎవరిని ఎంపిక చేయాలా ? అని కేసీఆర్ తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారని టాక్. ఇటు పదవి కాలం ముగుస్తోన్న కేకేతో పాటు ఈ పదవి ఎవరికి దక్కుతుందో ? కేసీఆర్ మదిలో ఎవరు ఉన్నారో ? చూడాలి.