రేవంత్ బాటలో వెళ్లాలంటే బాబు భయపడుతున్నారా!

-

తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి, ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటం మొదలుపెట్టారు. తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడుతూ, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో, ఆ రెండు పార్టీల లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

తన మాజీ శిష్యుడు ఇలా బీజేపీ, టీఆర్ఎస్‌లని టార్గెట్ చేసుకుని ముందుకెళుతుంటే, ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు ఈ అంశంపై పోరాటం చేయడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని మీడియా సమావేశాలు పెడుతున్నారుగానీ, దీనిపై ప్రజలపై ఎంత భారం పడుతుంది, ఈ రేట్లని తగ్గించాలని చంద్రబాబు మాత్రం ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయడం లేదు.

ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మీద చంద్రబాబు పోరాటం చేస్తున్నారుగానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పోరాటం చేయడానికి చంద్రబాబు భయపడుతున్నట్లున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్న బాబు, అందుకే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నారుగానీ, కేంద్రాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు. ఒకవేళ ప్రజల్లో పోరాటానికి దిగితే, బీజేపీపైన కూడా బాబు విమర్శలు చేయాలి. అందుకే బాబు దీనిపై పోరాటం చేయకుండా వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

అటు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించడానికి సిద్ధమవుతుంది. దీనికి వ్యతిరేకంగా మీడియాలో మాత్రమే మాట్లాడుతున్నారుగానీ, డైరక్ట్‌గా ఉద్యమం చేస్తూ బీజేపీపై పోరాటం చేయడం లేదు. అంటే బీజేపీ మీద విమర్శలు చేయడానికి బాబు భయపడుతున్నారని అర్ధమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. బాబు మాత్రం వైసీపీపై విరుచుకుపడుతూ, బీజేపీని వదిలేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news