హుజూర్ నగర్ ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ, రేవంత్ వ్యాఖ్యానించడం, అంతేగాక ఆయనపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అసలు రేవంత్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాడా లేదా అనేది తెలియక క్యాడర్ అయోమయంలో పడింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో గందరగోళానికి దారితీయడంతో ఈ అంశం అదిష్టానం దృష్టికి వెళ్లిందని గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిత్వంపై రేవంత్ కయ్యానికి కాలుదువ్వినట్లే వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేకపోతే మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం అది కూడా పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గంతో రేవంత్‌కు ఏం సంబంధం అనే వాదన వినిపిస్తోంది. ఉత్తమ్ మూడు సార్లు గెలిచిన స్థానంలో తన అభ్యర్థి ఫలనా వ్యక్తి అని ముందే ప్రకటించడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.
ఉత్తమ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న రేవంత్.. తన మద్దతుదారుడు కిరణ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే రేవంత్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హుజూర్ నగర్ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పడానికి అసలు రేవంత్ ఎవరని ? ప్రశ్నించారు. పార్టీ మధ్యలో వచ్చినవాళ్ల సలహాలు అక్కరలేదంటూ ఘాటుగా స్పందించారు. మరోపక్క సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు.
హుజూర్‌నగర్ లో పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కు స్వేచ్ఛ ఉంటుందని, అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. అంతేగాక కాంగ్రెస్ లో సింగిల్ హీరో ఉండరని.. అందరికీ రాహుల్‌గాంధీనే హీరో అని అన్నారు. ఏదేమైనా టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్న రేవంత్ .. కొంత సంయమనంతో ఉండాలని, పార్టీపై పట్టు రావాలంటే ఓపిక అవసరమని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పదవులు చేజార్చుకునే పరిస్థితులు కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.