రేవంత్ ఆవేదన..ఆ నలుగురుతోనే ముప్పు.!

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్నట్లు..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్, బలమైన నాయకులు ఉన్నారు గాని..గెలిచే బలం మాత్రం కనబడటం లేదు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు సాగుతున్న యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. ఓ రకంగా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయంలో కాంగ్రెస్ రేసులో నిలబడలేకపోతుంది. ఇక ఉపఎన్నికల్లో దారుణంగా ఓడిపోతుండటం, ఆ పార్టీకి చెందిన నేతలు వరుసపెట్టి జంప్ అయిపోవడంతో, కాంగ్రెస్ పరిస్తితి ప్రమాదంలో పడింది.

అయితే పార్టీని గాడిలో పెట్టడానికి పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు గాని..ఆయన్ని సీనియర్లు వెనక్కి లాగేస్తున్నారు..ఆయన ఏం చేసిన..వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎలాగైనా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అదే విషయాన్ని తాజాగా రేవంత్..ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. పార్టీలో నలుగురైదుగురు సీనియర్ నేతలు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని ఓపెన్ అయ్యారు. అసలు పీసీసీ కుర్చీలో కూర్చోవాలనుకుంటున్న వారు మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటామని, ఫలితం తేడాగా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యారనడం ఏంటని ప్రశ్నించారు.

అదే సమయంలో కాంగ్రెస్‌ని వదిలి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డిపై రేవంత్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలను మర్రి శశిధర్‌రెడ్డి స్వాహా చేశారని, వాటి లెక్కలు అడిగినందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు. ఏనాడూ పార్టీ కోసం పోరాడని మర్రి…కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేశారని, స్వయంగా ఆయన కొడుకు ఆదిత్యరెడ్డి సైతం తన తండ్రి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని 2018లో కోదండరాం పార్టీలో చేరారని, తాను అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు.

ఇక పార్టీని గాడిలో పెట్టడమే లక్ష్యంగా డిసెంబరు మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని నియమించనున్నట్లు తెలిపారు. ఇకపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని చూస్తున్నారు.