భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడిన మాటల వల్ల ఆ యాత్ర దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన సానుకూల శక్తి ఆవిరైందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వల్ల బీజేపీకే ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ సున్నితమైన అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారో అర్థం కావడం లేదన్నారు రౌజ్. ఈ మేరకు పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం ఆయన ఓ వ్యాసం రాశారు.
‘‘సావర్కర్ ను ఏదో తప్పుడు అక్రమ నగదు చెలామణి కేసులో అరెస్టు చేయలేదు. బ్రిటిష్ వలస పాలనపై సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. అందుకే ఆయన్ని అండమాన్‌లో బంధించారు’’ అని రౌత్ అన్నారు. సావర్కర్‌ను బ్రిటీష్ వారు షరతులతో విడిచిపెట్టారని.. దీన్ని బ్రిటిష్ వాళ్ల క్షమాభిక్షగా అభివర్ణించలేమని రౌత్ అన్నారు. జైలు నుంచి బయటకు రావడానికి క్షమాభిక్షను సావర్కర్ ఓ సాకుగా వాడుకున్నారని పేర్కొంటూ వై.డి.ఫడ్కే రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా రౌత్ ఉటంకించారు.
ఈడీ దర్యాప్తులకు భయపడి నేడు అనేక మంది నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గుతున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. పార్టీలు మారి విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కానీ, దేశ విముక్తి కోసం సావర్కర్ పదేళ్లు జైలులో గడిపారన్నారు. సావర్కర్‌ను విమర్శించడం భారత్ జోడో యాత్ర ఎజెండా కాదన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూను విమర్శించడం ప్రధాని మోదీ ఆపరని.. ఇప్పుడు రాహుల్ గాంధీ సైతం సావర్కర్ విషయంలో అదే చేస్తున్నారని రౌత్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ఏకం చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.