రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా పార్టీ కోసం తెగ కష్టపడ్డారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ఏడాది నుంచి పర్యటనలు చేసిన చంద్రబాబు… మహానాడు తర్వాత ఏకంగా భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఏడాది ముందే మిని మ్యానిఫెస్టో ప్రకటించారు. అటు చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే 2,500 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేశారు కూడా. అయితే అధినేత పడుతున్న కష్టాన్ని కింది స్థాయి నేతలు మాత్రం తమ జేబులు నింపుకునేందుకు యత్నిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ గ్రాఫ్ పెరిగింది అని టీడీపీ నేతలంతా భావిస్తున్నారు. కొందరు నేతలైతే… రాబోయే ఎన్నికల్లో గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు చంద్రబాబు విడుదల తర్వాత జరిగిన ర్యాలీని ఉదాహరిస్తున్నారు కూడా. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 14 గంటల ప్రయాణం సాగిందని… ప్రజలు బ్రహ్మరధం పట్టారని గొప్పగా చెబుతున్నారు. దీంతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కొందరు నేతలు.
రాబోయే ఎన్నికల్లో టికెట్లు మీకే ఇప్పిస్తామంటూ పార్టీ సీనియర్ నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు కొంతమందిని ప్రొత్సహిస్తున్నారు. అలాగే వార్డు స్థాయి ఇంఛార్జ్ పోస్టులు మొదలు… తెలుగు మహిళ, యువత, రైతు సంఘం వంటి పోస్టులను కూడా అమ్మేస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే డా.ఉండవల్లి శ్రీదేవికి తిరువూరు టికెట్ ఇప్పిస్తానంటూ బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఒకరు సుమారు రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే నేత రాజంపేట, మదనపల్లె నియోజకవర్గాల్లో కూడా కొత్త వారిని ప్రొత్సహిస్తూ.. డబ్బులు తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కింది స్థాయిలో మరి దయనీయంగా పరిస్థితి మారిపోయింది. చిన్న చిన్న పదవులకు కూడా వేల రూపాయలు వసూలు చేస్తూ… జేబులు నింపుకుంటున్నారు. రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి… మీకు సంపాదించుకునే అవకాశం ఉంటుందనే భరోసా కూడా ఇస్తున్నారు.